బీజేపీలో చేరుతున్న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు | 9 Congress MLAs in Assam to join BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరుతున్న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Published Thu, Nov 5 2015 2:50 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

బీజేపీలో చేరుతున్న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

బీజేపీలో చేరుతున్న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీ చాపకిందకు నీళ్లు వస్తున్నాయి. తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని అసోం బీజేపీ అధ్యక్షుడు సిద్దార్థ భట్టాచార్య ప్రకటించారు. కాంగ్రెస్ మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇప్పటికే వీళ్లంతా అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయన ఇంతకుముందే బీజేపీలో చేరారు. ఈ తొమ్మిది మందిలో నలుగురిని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మిగిలిన ఐదుగురిని సస్పెండ్ చేయకపోయినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది.

ఢిల్లీలో అమిత్ షాను కలిసిన ఈ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. తాము పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. వీళ్లలో.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా (జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్ (బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా (రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా (సిపాఝర్), జయంత మల్లా బారువా (నల్‌బారి) ఉన్నారు.

తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని అసోం బీజేపీ అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి తెలిపారు. పార్టీలో ఎవరు చేరాలనుకున్నా వారికి స్వాగతం చెబుతున్నామన్నారు. అసోంలో బీజేపీ ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ విషయం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ తొమ్మిది మంది రాజీనామా చేస్తే 126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 69కి పడిపోతుంది. అయినా.. మేజిక్ సంఖ్య 63కు ఎలాంటి లోటు లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement