న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లకు శనివారం అమలు జరగాల్సిన మరణ శిక్షను నిలుపుదల చేస్తూ పాటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో... కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్.. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని తనను సవాలు చేశాడని పేర్కొన్నాడు. అయితే తాను మాత్రం తన కూతురికి న్యాయం జరిగేంత వరకు.. దోషులను ఉరి తీసేంత వరకు పోరాటం ఆపబోనని స్పష్టం చేశానని తెలిపారు.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా..)
ఎందుకు ఆశలు కల్పించారు?
కోర్టు ప్రాంగణంలో ఆశాదేవి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం.. ప్రతీ ఒక్కరూ వినండి. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు నేరస్తుల ముందు తలవంచుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఇక్కడే వేచి చూస్తున్నాను. ఒకవేళ న్యాయస్థానం వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తే మమ్మల్ని ఇన్ని గంటలు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టినట్లు? మాకు ఎందుకు ఆశలు కల్పించినట్లు. మమ్మల్ని అప్పుడే ఇంటికి పంపివేయాల్సింది కదా. ఏడేళ్లుగా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏదేమైనా నా పోరాటం ఆగదు’’ అని భావోద్వేగానికి గురయ్యారు. (నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా)
ఇక నిర్భయ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో వినయ్ శర్మ మినహా మిగతా ముగ్గురిని శనివారం ఉరితీస్తామని భావించామని.. అయితే కోర్టు ఆదేశాలతో మరోసారి నిరాశకు గురయ్యామన్నారు. దోషులకు శిక్ష అమలయ్యేంత వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. దోషుల హక్కుల గురించి మాట్లాడుతున్న వారు.. బాధితుల హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.(నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీంకోర్టు షాక్)
ఒకేసారి కాదు.. ఒక్కొక్కరిని ఉరి తీయండి: నిర్భయ తల్లి
Comments
Please login to add a commentAdd a comment