‘నిర్భీక్’తో నిర్భయంగా..!
కాన్పూర్: ఆత్మరక్షణ కోసం మహిళలు ఇకపై పెప్పర్ స్ప్రేను ఉపయోగించాల్సిన అవసరం లేదు... మహిళ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఈ తుపాకీని తీసుకెళితే సరిపోతుంది... ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టొచ్చు...ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగి ఏడాది దాటిన నేపథ్యంలో ఇండియన్ ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ మహిళ రక్షణ కోసం తేలికైన ఈ తుపాకీని రూపొందించింది.
నిర్భీక్‌గా పిలిచే ఈ తేలికైన తుపాకీ కేవలం 500 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మహిళలు పర్సుల్లో, హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకునేందుకు వీలుగా రూపొందించిన .32 బోర్ రివాల్వర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. నిర్భయకు నివాళిగా తాము రూపొందించిన తుపాకీకి నిర్భీక్ అని పేరు పెట్టినట్లు ఫీల్డ్ గన్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. టైటానియం లోహంతో తయారు చేసిన ఈ నిర్భీక్ ధర రూ. 1,22,360గా నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్డర్ మీద బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.