
ముంబై: నిసర్గ తుపాను మహరాష్ట్ర తీరాన్ని తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల పెనువేగంతో తుపాను తరుముకొస్తున్న తరుణంలో నిషేధాజ్ఞలు జారీ చేసింది. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.(గుజరాత్, మహారాష్ట్రలను వణికిస్తోన్న నిసర్గ)
ఏం చేయాలి?
- ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులను వెంటనే లోపల పెట్టుకోవాలి.
- కీలకమైన పత్రాలు, ఆభరణాలు ప్లాస్టిక్ బ్యాగుల్లో భద్రపరచుకోవాలి.
- పవర్ సిస్టమ్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఫోన్లు చార్జింగ్ పెట్టుకోండి.
- ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు టీవీ, రేడియోలో అధికారుల సమావేశాలు చూడాలి.
- ఎమర్జెన్సీ సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి.
- ఎమర్జెన్సీ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి.
- కిటికీల నుంచి దూరంగా ఉండాలి. కొన్నింటిని మూసి మరికొన్నింటిని తెరచి ఉంచాలి.
- కుటుంబ సభ్యులంతా ఇంటి హాల్‌లో ఉంటే బాగుంటుంది. పాత ఇండ్లయితే కప్పు ఊడిపడే ప్రమాదం ఉన్నందున ఇలా చేయడం శ్రేయస్కరం.
- గాలులు బలంగా వీస్తున్న సమయంలో దృఢమైన ఫర్నీచర్ కింద దాక్కోవాలి. దానిని గట్టిగా పట్టుకుని కూర్చోవాలి.
- తల, మెడపై చేతులు అడ్డుపెట్టుకోవాలి.
- షాపింగ్ మాల్స్, ఆడిటోరియాలకు వెళ్లకూడదు.
- అవసరంలేని పరికరాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
- శుభ్రమైన ప్రదేశంలో మంచినీళ్లను నిల్వ చేసుకోవాలి.
- ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి. వారికి ప్రాథమిక చికిత్స అందించండి.
- వంట చేయడం ముగిసిన వెంటనే గ్యాస్ కట్టేయాలి. లీక్ అయినట్లు అనిపిస్తే వెంటనే కిటికీలు తెరచి ఉంచాలి.
- వైర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది.
- దివ్యాంగులు, పిల్లలు, వృద్ధులు, మహిళలకు అవసరమైన సహాయం అందించండి
తుపాను హెచ్చరిక: చేయకూడని పనులు
- దయచేసి వదంతులు ప్రచారం చేయవద్దు.
- తుపాను సమయంలో డ్రైవింగ్ చేయకూడదు.
- పురాతన భవనాల నుంచి ఖాళీ చేయాలి.
- గాయపడిన వారిని అత్యవరసమైతే తప్ప ఆస్పత్రికి తరలించకూడదు. ఎందుకంటే తుపాను వారితో పాటు మీకు కూడా హాని కలిగించవచ్చు.
- నూనె, ఇతర ఇంధనాలు కింద ఒలికిపోకుండా జాగ్రత్త పడాలి.
Preparedness for #NisargaCyclone pic.twitter.com/n9G6WriWQU
— CMO Maharashtra (@CMOMaharashtra) June 2, 2020