న్యూఢిల్లీ: వీధి లైట్లను ఆర్పాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కరోనాపై పోరాటానికి ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలు ఆర్పేసి సంఘీభావం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిన నేపథ్యంలో పలు అనుమానాలు తలెత్తడంతో కేంద్ర విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. ఇళ్లలోని విద్యుత్ వస్తువులను స్విచ్చాఫ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆసుపత్రులు, అత్యవసర విభాగాల్లో లైట్లు బంద్ చేయాల్సిన పనిలేదన్నారు.
వీధి లైట్లను బంద్ చేయాలని ఎటువంటి పిలుపు ఇవ్వలేదని, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వీధి లైట్ల ఆర్పొద్దని స్థానిక సంస్థలకు సూచించింది. విద్యుత్ దీపాలను ఆర్పడం వల్ల పవర్‌గ్రిడ్ కుప్పకూలిపోతుందని, వోల్టేజ్ హెచ్చుతగ్గులు తలెత్తి గృహోపకరణాలు పాడవుతాయన్న వదంతులను కేంద్ర విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. అలాంటివేమి జరగబోదని పేర్కొంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలోని విద్యుద్ దీపాలు బంద్ చేస్తే చాలని స్పష్టం చేసింది. (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది)
ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరాటానికి చిహ్నంగా ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్–5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ లైట్లను వెలిగించాలంటూ ప్రధాని మోదీ శుక్రవారం వీడియా సందేశంలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడికి సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా ప్రధాని ఇలాంటి పిలుపులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?)
Comments
Please login to add a commentAdd a comment