సాక్షి, న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తత, నెట్‌వర్క్ సెక్యూరిటీ సమస్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు షాకివ్వనుంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాల వినియోగాన్ని నిషేధించనుంది. బీఎస్‌ఎన్‌ఎల్ తో పాటు ఎంటీఎన్ఎల్, ఇతర అనుబంధ సంస్థలకు కూడా ఇదే ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి రీ-టెండరింగ్ కు కూడా వెళ్లనుంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ సంస్థలో మేడ్-ఇన్-చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికం విభాగం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ లో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులను కొనుగోలు చేయమని తన పరిధిలోని అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రైవేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తి చేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించాలంటూ ఆదేశించనుంది. అలాగే టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలు పాల్గొనలేని విధంగా నిబంధనలను మార్చాలని రాష్ట్రంలోని సర్వీసు ప్రొవైడర్లను కోరడంతోపాటు, మునుపటి టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కోరనుంది.
కాగా లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దుశ్చర్య కారణంగా 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) కూడా సిద్ధమయ్యింది. చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ట్విటర్‌లో 'హిందీచీనిబైబై', 'భారత్ వెర్సస్ చైనా వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment