ఆ మంత్రిపై కేసు నడవాల్సిందే
కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బార్ లైసెన్సుల కేటాయింపు కోసం లంచాలు తీసుకున్నారంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి కేఎం మణిపై ఉన్న కేసు విచారణ కొనసాగాల్సిందేనని ప్రత్యేక విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. కేసును మూసేస్తామంటూ విచారణ సంస్థ దాఖలుచేసిన తుది నివేదికను కోర్టు తోసిపుచ్చింది.
కేరళలో బార్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు మణి 5 కోట్ల లంచం డిమాండ్ చేశారని, ముందుగా 470 బార్లను తెరిపించేందుకు కోటి రూపాయలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి ఆరోపణలు లేవని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రత్యేక జడ్జి జాన్ కె. ఇల్లెకదన్ తోసిపుచ్చారు. దీనిపై మరింత విచారణ జరగాలని ఆదేశించారు.
మంత్రిపై చార్జిషీటు పెట్టడానికి తగిన సాక్ష్యాలు లేవని విజిలెన్స్ బ్యూరో తన నివేదికలో చెప్పింది. అయితే, ఈ నివేదికను సవాలుచేస్తూ సీపీఎం సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్, మరో 8 మంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో మణిని విచారించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు.