ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(72)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ఆమెకు అధికార దుర్వినియోగం కేసులో జైలు శిక్ష ఖరారైంది. బంగ్లాదేశ్ రాజధానిలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఖలేదాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జియా తన భర్త పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థకోసం అక్రమంగా నిధులను సేకరించిన ఆరోపణలనువిచారించిన కోర్టు సోమవారం ఈ తీర్పునిచ్చింది. మాజీ ప్రధానితోపాటు హారిస్ చౌదరి సహా మరో ముగ్గురికి కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పది లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.
ఢాకాలోని జియా చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ కోసం 375 వేల డాలర్ల గుప్త విరాళాలను సేకరించడంలో ప్రధానమంత్రిగా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జడ్జి వ్యాఖ్యనించారు. కాగా విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున జియా కోర్టుకు హాజరు కాలేదు. మరోవైపు రెండు కేసులకు సంబంధించిన ఆరోపణలను ఖలీదా జియా పార్టీ ఖండించింది. రాజకీయ కుట్రగా అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment