ఆ కళంకిత మంత్రిని పీకేయండి!
తిరువనంతపురం: బార్ లైసెన్సుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి నిర్దేశించింది. దీంతో ఆయనను మంత్రిమండలి నుంచి తొలగించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బార్ లైసెన్సుల కుంభకోణంలో కేఎం మణి పాత్ర ఉందని కేరళ హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు సూచనలు అందినట్టు తెలుస్తోంది.
ప్రమాణాలు పాటించడం లేదని కేరళలో మూసివేసిన మద్యం షాపుల లైసెన్స్‌లను పునరుద్ధరించేందుకు ఆర్థికమంత్రి కేఎం మణి రూ. కోటి డిమాండ్ చేసి.. లంచంగా తీసుకున్నారని ఓ హోటల్ యాజమాని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఓ మంత్రి నిందితుడిగా ఉన్న కేసులో దర్యాప్తు సజావుగా జరుగుతుందని సామాన్యుడు భావించే పరిస్థితి లేదని పేర్కొంది. యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పార్టీకి చెందిన కేఎం మణి మంత్రిపదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇదివరలో సీఎం ఊమెన్ చాందీ పేర్కొన్న సంగతి తెలిసిందే.