న్యూఢిల్లీ: ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించరాదని పేర్కొనే మానసిక ఆరోగ్య పరిరక్షణ బిల్లు 2013ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సదరు వ్యక్తి అలాంటి చర్యలకు పాల్పడటానికి కారణం అతడి మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడమేనని.. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 309 నిబంధనల కింద వారిని శిక్షార్హులుగా పరిగణించరాదని ఈ బిల్లు చెబుతోంది. విప్లవాత్మక బిల్లుగా పేర్కొంటున్న దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖఈ వారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. దేశ క్రిమినల్ చట్టంలో ఈ తరహా సవరణ కోరడం ఇదే తొలిసారి. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారి హక్కుల పరిరక్షణకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.