న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని బాదౌన్ జిల్లా కర్తా గ్రామంలో అత్యాచారానికి గురైన అక్కాచెల్లెళ్లది ఆత్మహత్యగా సీబీఐ తేల్చింది. వీరిపై ఎవరో సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి ఉంటారని వచ్చినవి పుకార్లేనని, వాస్తవం కాదని సిబిఐ స్పష్టం చేసింది. వారిద్దరూ హత్యాగావించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ అయిదు నెలల అనంతరం నివేదిక ఇచ్చింది.
ఈ ఏడాది మే 28న బదౌన్ జిల్లాలో దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన దారుణ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాగ్రహం వెల్లువెత్తటంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణను సీబీఐ జూన్లో చేపట్టింది.
బదౌన్ జిల్లా కర్తా గ్రామానికి చెందిన 14,15 ఏళ్ల వయసున్న దళిత బాలికలు ఈ ఏడాది మేలో అదృశ్యమయ్యారు. మరుసటి రోజు పళ్లతోటలో వారిద్దరూ సామూహిక లైంగిక దాడికి గురయ్యారు. అక్కడే చెట్టుకు ఇద్దరి మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచనలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అఖిలేష్ ప్రభుత్వానికి కూడా ఈ ఘటన చెడ్డపేరు తెచ్చింది.