సరిహద్దులో ఈ సారి స్వీట్లులేవు
అమృత్‌సర్: ముఖ్యమైన పండుగల సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న భారత్, పాకిస్తాన్ సైనికులు స్వీట్లు పంచుకోవడం ఓ ఆనవాయితి. ఇరుదేశాల స్వాతంత్ర్య దినోత్సవాలు, ఈద్, దీపావళి రోజుల్లో పంజాబ్‌లోని అట్టారి-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ వద్ద ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే.. ఉడీ ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన సర్జికల్ దాడులు, పాక్ వైపు నుంచి నిరంతరం కొనసాగుతున్న కాల్పుల ఉల్లంఘనల నేపథ్యంలో ఈ సారి స్వీట్లు పంచుకునే కార్యక్రమానికి బ్రేక్ పడింది.
బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు పాకిస్థాన్ రేంజర్లతో స్వీట్లు పంచుకుని.. శుభాకాంక్షలు చెప్పుకునే కార్యక్రమాన్ని ఈ సారి నిలిపివేశారు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కొన్ని సందర్భాల్లో ఇదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని నిలిపేశారు. అయినా.. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాక్ దేశం సైనికులతో స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నంత మాత్రాన సోదరభావం ఉప్పొంగుతుందా. ఎవరో అన్నట్లు కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా!