రాజకీయాల్లోకి రాను : రజనీకాంత్
పనాజీ: తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. గోవా రాజధాని పనాజీలో ప్రారంభమైన 45వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఓ జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రజనీ మాట్లాడుతూ... రాజకీయాలలో చేరాలని తనను పలు పార్టీలు ఇప్పటికే ఆహ్వానించాయని, అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. కాగా తనకు రాజకీయాలంటే భయం మాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొంత అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవమేనని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు.
ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ చేతుల మీదగా రజనీ సెంటినరీ అవార్డు ఫర్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. అమితాబ్, మీరు కలసి భవిష్యత్తులో కలసి నటిస్తారా అని విలేకర్లు ప్రశ్నించగా అందుకు రజనీ చిరునవ్వే సమాధానమిచ్చారు. కాగా రజనీ నటించిన తాజా చిత్రం లింగా డిసెంబర్ 12న విడుదల కానుంది