
'నిజాయితీగా మాట్లాడటమే నాకు తెలుసు'
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై గురువారం లోక్సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే విపక్ష సభ్యుల నిరసల మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
అయితే వెంకయ్య క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేయటంతో సభలో గందరగోళం నెలకొంది. తమపై విమర్శలు చేసేముందు విపక్షాలు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రతిపక్షాలను అవమానపర్చడం మర్యాద కాదన్నారు. సభలను అడ్డుకోవటం తమ ఉద్దేశం కాదన్నారు.
మరోవైపు వెంకయ్య నాయుడు తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తన వ్యాఖ్యలను విపక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నాయన్నారు. నిజాయితీగా మాట్లాడటమే తనకు తెలుసునని, ఎవరినీ ఉద్దేశించి తాను మాట్లాడలేదన్నారు. తానెప్పుడూ అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని వెంకయ్య కోరారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ ...సమావేశాలను 11.30గంటలకు వాయిదా వేశారు.