ఏపీకి ప్రత్యేకం లేదు
‘లీగల్' కమిట్‌మెంట్స్‌కు కట్టుబడి ఉంటాం: జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ లేదంటూ కేంద్రం పరోక్షంగా తేల్చేసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఇచ్చిన అన్ని చట్టబద్ధమైన హామీలను నెరవేరుస్తామని చెప్పింది. అంటే అప్పటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ప్రకటించిన స్పెషల్ స్టేటస్ హామీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో లేదు. బహుశా అందువల్లే ఆర్థిక మంత్రి జైట్లీ తన ప్రసంగంలో ‘లీగల్ కమిట్‌మెంట్స్’ అనే పదాన్ని ఉపయోగించినట్టు అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రగాఢ వాంఛ అయిన స్పెషల్ స్టేటస్‌కు కేంద్రం బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపగా.. ఇటు తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్‌కు, వాటర్ గ్రిడ్‌కు నిధులు కేటాయించాలని పదేపదే కోరినా ఫలితం దక్కలేదు. గత ఏడాది పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.250 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు నామమాత్రంగా రూ.100 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన పెద్ద పద్దు ఏదైనా ఉందంటే.. ఇదొక్కటే. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలుమార్లు ఢిల్లీ వచ్చి అన్ని శాఖలతో సంప్రదింపులు జరిపినా బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు.
అన్యాయం ఎక్కడెక్కడ?
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అనేక హామీలు ఇచ్చింది. వాటిలో కీలకమైనవి.. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు, వైజాగ్-చె న్నై ఇండస్ట్రియల్ కారిడార్, కడపలో స్టీలు ప్లాంటు, విశాఖల పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం.. వంటి అంశాలు పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో ఉన్నాయి. అలాగే తెలంగాణకు స్టీలు ప్లాంటు తదితర హామీలు కూడా ఉన్నాయి. కానీ వీటిలో మెట్రోలకు రూ.5.63 కోట్ల చొప్పున కేటాయించడం తప్పితే మిగిలిన వాటి ఊసేలేదు.
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమయ్యే వనరులను దృష్టిలో ఉంచుకుని సముచిత రీతిలో గ్రాంట్లను విడుదల చేయాలి. అలాగే వెనకబడిన జిల్లాలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ రూపంలో ప్రోత్సహకాలు, ప్రయోజనాలు కల్పించాల్సి ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించడం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు చేసే ఆర్థిక సాయంలో గ్రాంటు శాతం పెరుగుతుంది. జనరల్ కేటగిరీలోని రాష్ట్రాలకు ఇచ్చే సాయంలో 30 శాతం గ్రాంట్లుగా ఉంటే.. స్పెషల్ కేటగిరీ స్టేటస్‌లో ఉండే రాష్ట్రాలకు 90 శాతం గ్రాంటు ఉంటుంది. అందువల్ల ఈ హోదా ప్రకటిస్తే రాష్ట్ర ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. అప్పటి ప్రధాని మన్మోహన్ చేసిన ఈ ప్రకటనకు రాజ్యసభలోను, బయటా బీజేపీ మద్దతు పలికింది. కానీ తాజా బడ్జెట్‌లో ఇక ఎప్పటికీ స్పెషల్ స్టేటస్ రాదన్న రీతిలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కోరాపుట్-బొలాంగిర్-కలహండి (కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని ఆనాటి ప్రధాని రాజ్యసభలో చెప్పారు. కానీ ఇటీవల కేంద్రం జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని జిల్లాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇది నామమాత్రం. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత కేటాయిస్తారో ఈ బడ్జెటలో చెప్పలేదు. మరోవైపు వెనబడిన జిల్లాలకు ఇచ్చే బీఆర్‌జీఎఫ్‌ను కేంద్రం రద్దు చేసింది. అంటే ఆ చేత ఇచ్చి.. ఈ చేత లాగేసుకున్నట్టయింది.
రాజధాని నగరానికి నిధుల్లేవు
పునర్ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, తదితర అవసరమైన మౌలిక వసతులు సహా కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. కానీ దీన్ని కనీసం ప్రస్తావించలేదు. ఇక ఏపీలో పలు జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీ ఇచ్చింది.
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, ఐఐఐటీ వంటి జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ బోధానాస్పత్రి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహాలో బోధనాస్పత్రి వంటి సంస్థలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిర్మిస్తామని కేంద్రం చెప్పింది. ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీ, పెట్రో వర్సిటీ, ట్రైబల్ వర్సిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలల్లో కొన్నింటికి మాత్రమే నామమాత్రపు నిధులు కేటాయించింది.
ఎన్ని దశాబ్దాలకో పోలవరం
పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 పోలవరానికి జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయంతోపాటు పునరావాసానికి కూడా కేంద్రం కేటాయిస్తుందని ఆ చట్టం చెబుతోంది. రాష్ట్ర విభజన తరువాత నాలుగేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 250 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది కేవలం రూ.100 కోట్లు విదిలించారు. ఈ ప్రాజెకు పూర్తవడానికి దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది.
తెలంగాణకు బడ్జెట్ పద్దులు ఇవీ..
అంశం కేటాయింపు
(రూ.కోట్లలో)
ఐఐటీ-హైదరాబాద్ 55
ఉద్యానవన విశ్వవిద్యాలయం 75
గిరిజన విశ్వవిద్యాలయం 1.00
ఏపీకి బడ్జెట్ పద్దులు ఇవీ..
పోలవరం ప్రాజెక్టు 100
విజయవాడ మెట్రో రైల్ 5.63
వైజాగ్ మెట్రో రైల్ 5.63
ఐఐటీ 40
ఎన్‌ఐటీ 40
ఐఐఎం 40
ఐఐఎస్‌ఈఆర్ 40
ట్రిపుల్ ఐటీ 45
వ్యవసాయ విశ్వవిద్యాలయం 75
గిరిజన విశ్వవిద్యాలయం 1.00
పెట్రోలియం వర్సిటీ 1.00
సెంట్రల్ వర్సిటీ 1.00
ప్రభుత్వరంగ సంస్థలకు
విశాఖ పోర్టు ట్రస్ట్ 414
సింగరేణి కాలరీస్ 2,390
(రెండు రాష్ట్రాలకు కలిపి పారిశ్రామిక యూనిట్లకు రూ.100 కోట్ల వడ్డీ సాయం ఇవ్వనున్నట్టు ప్రస్తావించారు)