
ములాయంకు ఊహించని షాక్!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాకూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా పెడితేనే చేతులు కలుపుతామని భాగస్వామ్య పార్టీలు స్పష్టం చేయడంతో ములాయం ప్రయత్నాలకు ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది.
సమాజ్ వాదీ పార్టీలో ముసలం రేగడంతో ములాయం.. కొడుకుని కాదని సోదరుడు శివపాల్ యాదవ్, ప్రాణమిత్రుడు అమర్ సింగ్ పక్షం వహించారు. సమాజ్ వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ఖరారు చేస్తేనే ఉమ్మడి పోరుకు అంగీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. ములాయం మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా తన కుటుంబంలో రేగిన కలహాలను పరిష్కరించుకోవాలని ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ సూచించినట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. పరి'వార్' తర్వాత ములాయం కంటే అఖిలేశ్ కు ప్రజాదరణ పెరిగిందని ఒక సర్వేలో వెల్లడైన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.
కాగా, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి వస్తేనే మహాకూటమి సాధ్యమన్న అభిప్రాయాన్ని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తం చేశారు. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికప్పుడు మహాకూటమి నుంచి చివరి నిమిషంలో ములాయం తప్పుకుని నితీశ్ కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ములాయంతో చేతులు కలిపే విషయంలో నితీశ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 5న జరగనున్న సమాజ్ వాదీ పార్టీ రజతోత్సవాలకు హాజరుకాకూడదని నితీశ్ నిర్ణయించుకున్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత సంక్షోభం యాదవ్, ముస్లిం ఓట్లపై బాగా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.