బీజేపీలోకి ములాయం కోడలు?
లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అపర్ణ నేతృత్వంలోని ఎన్జీవో నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్(గోశాల)ను శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. బీజేపీలో చేరే అవకాశముందా అని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు చెబుతా అని అపర్ణ సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నారు.
బీజేపీలో చేరికను ఆమె ఖండించకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం పోటీ చేసిన అపర్ణ.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. ఈ నెల 24న తన భర్త ప్రతీక్ యాదవ్ తో పాటు సీఎం యోగిని కలిసి 20 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిసినట్టు అపర్ణ అప్పుడు చెప్పారు. ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఆమె బీజేపీలోకి వెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.