
రాంచి: అత్త వారింట్లో మరుగుదొడ్డి లేకపోవటంతో అలిగిన అల్లుడు అది నిర్మించే వరకు తాను వెళ్లబోనని, భార్యను వెళ్లనిచ్చేది లేదని భీష్మించాడు. జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భులి పట్టణానికి చెందిన ప్రమోద్‌కుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 15 వ తేదీన గిరిదిధ్ జిల్లా జోగ్తియాబాద్ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరునాడే అత్తవారింటికి వెళ్లిన ప్రమోద్ బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో టాయిలెట్ ఎక్కడుందని అత్త వారింట్లో వాకబు చేయగా.. వారు అతనికి నీళ్ల చెంబు అందించి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లాలని సూచించారు. దీంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది.
ఆ తర్వాత భార్యతో తన స్వగ్రామానికి చేరుకున్న అతడు.. టాయిలెట్ కట్టేదాకా అత్తవారింటికి వెళ్లేది లేదని తెగేసి చెప్పాడు. అంతేకాదు, భార్యను కూడా వెళ్లనిచ్చేది లేదని అడ్డుపడ్డాడు. దీంతో దిగివచ్చిన మామ జగదేశ్వర్ పాశ్వాన్... అల్లుడి కోరిక మేరకు మరుగుదొడ్డి నిర్మించేందుకు ఏర్పాట్లు చేపట్టాడు. దీంతో త్వరలోనే కూతురు, అల్లుడు తమ ఇంటికి వస్తారని పాశ్వాన్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 2018 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా మారేందుకు జార్ఖండ్ కృషి చేస్తోంది.