'నేను కాదు కదా.. నా వాళ్లు కూడా బరిలో లేరు'
పాట్నా: తాను బీహార్ ముఖ్యమంత్రి రేసులో లేనని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, ఎన్డీయే భాగస్వామి, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి కూడా ఎవరూ ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు ఓ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని, అది కూడా తమ పార్టీ అధినేతకే ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం విధితమే.
ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు కాస్తంత అసహనంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాశ్వాన్ మంగళవారం మీడియా ముందుకొచ్చి తాను బీహార్ ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని, తన పార్టీ నుంచి కూడా ఎవరూ లేరని, ఈ విషయంలో ఇంకా ఎవరినీ ఏమీ అడగాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ఎవరినీ ఆమోదిస్తే వారినే ఎల్జేపీ కూడా అంగీకరిస్తుందని అన్నారు. వారు ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్, జీ, హెచ్, ఐ ఇలా ఎవరినీ ప్రకటించినా వెంటనే ఆమోదం తెలుపుతామని చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశిల్ కుమార్ మోదీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాశ్వాన్ ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు.