మిజోరాం : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను వ్యతిరేకిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు సంస్థలు గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాయి. వీటితో పాటు కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ఈశాన్య రాష్ర్టాల్లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు.
ఇలా పిలుపునిచ్చిన వాటిల్లో నాగలాండ్‌కు చెందిన ‘నాగ స్టూడెంట్స్ ఫెడరేషన్’(ఎన్‌ఎస్‌ఎఫ్), మణిపూర్‌కు చెందిన మరి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఎఫ్ పౌరసత్వ బిల్లు పట్ల ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరితో ప్రజలను తప్పు దోవ పట్టింస్తోందని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలంటూ ఎన్‌ఎస్‌ఎఫ్ పిలుపునిచ్చింది. ఇక మణిపూర్‌కు చెందిన ఐదు పౌరసంస్థలు కూడా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాయి.
దాంతో అక్కడి ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి ఆరేండ్ల పాటు దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించాలని కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016ను పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment