మోదీనే కాదండి.. కేజ్రీవాల్ కూడా!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ నినాదంతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. సామాన్యుల కోసం పోరాడే చాంపియన్ గా కేజ్రీవాల్ ను ఆయన అభిమానులు కీర్తిస్తారు. అయితే, త్వరలోనే ఆయన లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో వీవీఐపీల సరసన నిలువబోతున్నారు.
ఇప్పటికే మేడం టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మలుగా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ సందర్శకులను ఆకట్టుకుంటుండగా.. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపుబొమ్మ కూడా ఈ మ్యూజియంలో చేరనుంది. అచ్చం మోదీలా రూపురేఖలు, హవాభావాలున్న ఈ మైనపు బొమ్మకు ఇటీవల తుది మెరుగులు దిద్దుతూ దింపిన ఫొటోలు బాగా హల్ చల్ చేశాయి. నిజంగా మోదీనే చూస్తున్న భావన కల్పించాయి.
ఇక అరవింద్ కేజ్రీవాల్ మైనపుబొమ్మ కూడా ఈ మ్యూజియంలోకి చేరనుంది. అచ్చం తనలాగే ఉండే ఈ బొమ్మ రూపకల్పన కోసం కొలతలు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ఒప్పుకొన్నారని, వచ్చేనెలలో కొలతలు తీసుకుంటారని కేజ్రీవాల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
మఫ్లర్ తో పోజిస్తారా?
కామన్ మ్యాన్ ప్రతీకగా తనను తాను భావించుకునే అరవింద్ కేజ్రీవాల్ అనగానే చాలామందికి ఆయన మఫ్లర్ గుర్తుకొస్తుంది. ఢిల్లీలోని చలి వాతావరణం తట్టుకోవడానికి ఆయన తరచూ మఫ్లర్ ధరించి కనిపించేవారు. తన ఇంటిలో సీబీఐ దాడులు జరిపితే మఫ్లర్లే ఎక్కువగా దొరుతాయని కేజ్రీవాల్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. ఈ నేపథ్యంలో మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టే మైనపు బొమ్మకు కూడా మఫ్లర్ ఉంటుందా? మోదీ, కేజ్రీవాల్ పోటాపోటీగా ఈ మ్యూజియంలో కొలువైతే.. ఎవరితో ఎక్కువగా సెల్ఫీలు దిగేందుకు ప్రజలు పోటీపడతారు? అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అన్నట్టు వచ్చే ఏడాది ఢిల్లీలో కూడా తన శాఖను ఏర్పాటుచేయాలని మేడం టుస్సాడ్ మ్యూజియం భావిస్తోంది.