తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్లే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన చట్టాన్ని సవరించినా సీట్ల పెంపు సాధ్యంకాదని రాజ్యసభలో కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ తేల్చిచెప్పారు.
విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలను పెంచాలని ఏపీ, తెలంగాణ కేంద్రాన్ని కోరాయి. 2026లో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సివుండగా, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ముందుగానే సీట్లు పెంచాలని తెలుగు రాష్ట్రాలు కోరాయి. అసెంబ్లీ సీట్ల పెంపుపై టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారామ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం అటార్నీ జనరల్ వివరణ కోరగా, తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు కుదరదని కేంద్రానికి అటార్నీ జనరల్ నివేదిక ఇచ్చారు. నియోజక వర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ చెప్పారు. కేంద్ర మంత్రి ఈ విషయాన్ని సభలో తెలిపారు.