అగ్ర కులస్తుడితో ‘రోహిత్’ దర్యాప్తా?
♦ ప్రభుత్వంపై మండిపడిన మాయావతి
♦ కమిషన్‌లో దళితుడిని సభ్యుడిగా చేర్చాలని డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై రాజ్యసభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఇరానీ ప్రకటనతో తాను సంతృప్తి చెందడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో దళితుడికి కూడా స్థానం కల్పించాలని ఫిబ్రవరి 24న తాను కేంద్రాన్ని కోరానని, దానిపై ఇప్పటివరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్‌వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు.
ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది’ అని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం కమిషన్‌లో మరో సభ్యుడిని నియమించే అవకాశముందని, అయితే, ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రోహిత్‌కు ఫెలోషిప్‌ను నిలిపివేయడంపై మాయావతి ప్రశ్నించగా.. కొన్ని పత్రాలు రోహిత్ వర్సిటీ అధికారులకు ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారని ఇరానీ బదులిచ్చారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ అని స్పష్టం చేశారు. కాగా, ఫేస్‌బుక్‌లో రోహిత్ తనపై చేశాడంటూ ఇరానీ పేర్కొన్న కామెంట్ల ప్రామాణికతను సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఆ ఫేస్‌బుక్ అకౌంట్ రోహిత్‌దేనని రుజువేమైనా ఉందా? అని అడిగారు. ప్రామాణికతను నిర్దేశించకుండా ఆ కామెంట్లను సభలో ప్రస్తావించడాన్ని ఏచూరి తప్పుబట్టారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకుంటూ.. స్మృతి చదివిన ఆ కామెంట్లను వర్సిటీ రిజిస్ట్రార్ ధ్రువీకరించారన్నారు.
సభలో దుర్గామాతపై దూషణలా?
హిందువుల దేవతైన దుర్గామాతపై అసభ్యంగా, దూషణపూర్వకంగా రాసిన రాతలను గురువారం సభలో చదివి వినిపించిన ఇరానీపై శుక్రవారం రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. సభకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. జేఎన్‌యూ విద్యార్థుల తీరుపై తాను చేసిన వ్యాఖ్యలకు రుజువులు చూపాలని ప్రశ్నించినందువల్లనే ఆ కరపత్రాలను చదివి వినిపించానని ఇరానీ సమర్థించుకున్నారు. తాను దుర్గామాత భక్తురాలినని చెప్పారు. ‘ఆ కరపత్రాలను సమర్థిస్తుంది.. కానీ వాటిని సభలో చదవడాన్ని మాత్రం తప్పంటుంది’ అని కాంగ్రెస్‌కు చురకలేశారు. అయితే, దైవదూషణకు సంబంధించిన వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు. అంతకుముందు, దైవాన్ని నిందించే వ్యాఖ్యలేవీ సభలో మాట్లాడరాదని రాజ్యాంగం, నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలన్న ప్రతిపాదనతో సభముందుకు వచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభలో ఓడిపోయింది.
మోదీకి కూడా ‘మౌనీబాబా సిండ్రోమ్’
లోక్‌సభలో తృణమూల్ సభ్యుడి విమర్శ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌లాగా ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ‘మౌనీ బాబా సిండ్రోమ్’తో బాధపడుతున్నారని టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ వ్యాఖ్యానించారు. రెండు అధికార కేంద్రాలు ఉండటంతో మౌనంగా ఉండే వ్యాధి వస్తుందని, ప్రస్తుతం నాగపూర్‌లో మరో అధికార కేంద్రం ఉండటం వల్ల మోదీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం నాగపూర్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తీర్మానంపై చర్చలో కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడిన 70 నిమిషాలు ప్రధానిని పొగడడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఈ ప్రభుత్వం యూపీఏ 3నా లేక ఎన్డీయే 2నా’? అని జోకులు పేలుతున్నాయన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు కరెన్సీ నోట్ల కట్టలతో వెళ్తున్నారని సుల్తాన్ అహ్మద్ చేసిన ఆరోపణలను హోంమంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వ వైఫల్యంతో మోదీలో నిస్పృహ
ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఎన్జీవోలు, బ్లాక్‌మార్కెటీర్లు కుట్రలు చేస్తున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలపై సీపీఎం స్పందించింది. ప్రధానిగా రెండేళ్లు గడవకముందే మోదీలో నిరాశానిస్పృహలు తలెత్తాయని పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’లో రాసిన సంపాదకీయంలో కారత్ పేర్కొన్నారు.రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్‌వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది. కొన్ని పత్రాలు వర్సిటీ అధికారులకు రోహిత్ ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ.