HRD Minister
-
విద్యా విధానంలో భారీ మార్పులు
-
టీచర్ల ఇళ్లలోనే జవాబు పత్రాల మూల్యాంకనం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఉపాధ్యాయులు తమ ఇళ్లలోనే మూల్యాంకనం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ శనివారం చెప్పారు. ఈ జవాబు పత్రాలను టీచర్లకు అందజేయడానికి 3 వేల పాఠశాలలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన 1.5 కోట్ల ఆన్సర్ షీట్లను టీచర్లకు అందజేస్తామన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకనాన్ని 50 రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జూలై 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. -
జూలై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్, జూలై 18 నుంచి 23 వరకు జరగనున్న జేఈఈ మెయిన్స్, జూలై 26న జరగనున్న నీట్ కన్నా ముందుగానే సీబీఎస్ఈ వాయిదాపడిన పరీక్షలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ తేదీలను నిర్ణయించారు. లాక్‌డౌన్‌తో వాయిదా పడిన 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉండగా, అల్లర్ల కారణంగా ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలను ఇప్పుడు నిర్వహిస్తామని తెలిపారు. షెడ్యూల్ వచ్చేవారం ప్రకటిస్తామన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఉపాధ్యాయుల ఇళ్ళనుంచి జరిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్ మెరిట్ లిస్ట్ ప్రకటించడానికి ముందే, ఆగష్టు చివరికి 12వ తరగతి రిజల్ట్సును ప్రకటించేందుకు యత్నిస్తున్నట్టు వెల్లడించారు. -
రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు
సాక్షి, నాయుడుపేట: తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం కేంద్రమానవ వనరులశాఖ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం పాలచ్చూరులో, చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోనలో రెండు కేంద్రీయ విద్యాలయాలను వచ్చే విద్య సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్టు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సంబంధిత శాఖ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుకెళ్లి మంజూరుకా కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. -
పెద్దల చదువుల మర్మమేమి?
డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిషాంక్ మన విద్యా శాఖ మంత్రి, కవి, సాహితీవేత్త. హిందీలో పేరెన్నికగన్న రచయిత. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కొలంబోలో ఉన్న ఒక అంతర్జాతీయ ఓపెన్ యూనివర్సిటీ ఆయనగారికి సాహిత్యంలో విశిష్టమైన సేవలందించారని ఒక డాక్టరేట్, అంతకుముందు శాస్త్రీయరంగంలో రచనలకు మరొక డాక్టరేట్ ఇచ్చింది. గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ ఒకటి, ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వవిద్యాలయం మరొక గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. అయితే విచిత్రమేమంటే శ్రీలంకలో అంతర్జాతీయ ఓపెన్ యూనివర్సిటీకి అసలు యూనివర్సిటీగా గుర్తింపు లేదు. శ్రీలంకలోని యూజీసీ కూడా దాన్ని గుర్తించలేదు. ఇతరదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకు యూజీసీ గుర్తింపు లేకపోతే మన యూజీసీ కూడా అంగీకరించదు. వారిచ్చే డిగ్రీలకు విలువ ఇవ్వదు. అంతేకాదు. మన దేశంలో సిఎస్ఐఆర్ (సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ సెంటర్) 1998లో దేశంలోని అన్ని జాతీయ ప్రయోగశాలలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ శ్రీలంక విశ్వవిద్యాలయం ఇచ్చే డిఎస్సీ డిగ్రీలను గానీ, మరే ఇతర డిగ్రీలను గానీ యూజీసీ గుర్తించలేదని, కనుక ఆ డిగ్రీలు చెల్లవని చాలా స్పష్టంగా పేర్కొంది. ఇటువంటి అద్భుతమైన సంస్థ ఇచ్చిన డిగ్రీలను వాడుకోవడం, పేరు ముందు డాక్టర్ అని తగిలించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోగా, ఇచ్చిన యూనివర్సిటీ వారు తాము భారతదేశంలో ఉన్న ఒక పెద్ద ముఖ్యమంత్రిగారికి గౌరవప్రదమైన డాక్టరేట్ డిగ్రీ ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడమే కాకుండా, తమ అత్యున్నత ప్రమాణాలకు దీన్ని కొలమానంగా చూపుతూ ఫోటోగ్రాఫులకు విపరీతంగా ప్రచారం ఇచ్చి, మరికొంత మంది అమాయకులను వలలోవేసుకుంటాయి. పోక్రియాల్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన పేరును డాక్టర్ రమేష్ పోక్రియాల్ అని చెప్పుకుంటూ ప్రమాణం చేశారు. డాక్టర్ రమేష్ గారి ప్రత్యర్థి అయిన మనోజ్ వర్మ డాక్టర్ అనే బిరుదును వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, కనుక ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణ పత్రంలో తాను డాక్టర్‌నని చెప్పుకోవడం చెల్లదని, అందువల్ల ఆయన ఎన్నిక కూడా చెల్లదని మనోజ్ వర్మ వాదించారు. ఈ మనోజ్ వర్మ కాంగ్రెస్ నాయకుడు కాదు. కమ్యూనిస్టు అంతకన్నా కాదు. స్వయంగా ఆయన కూడా బీజేపీ నాయకుడే. ఒక ఎన్నికను రాష్ట్రపతి ఈ విధంగా రద్దు చేయడానికి ప్రకటనలు చేసే అధికా రం ఉండకపోవచ్చు. డాక్టర్ పోక్రియాల్కి ఇచ్చిన బీఏ ఎంఏ డిగ్రీలు కూడా అనుమానించతగినవే అని వాదిస్తూ రాజేశ్ మధుకాంత్ అనే పౌరుడు ఒకాయన, ఆ డిగ్రీలు, ఎప్పుడు ఇచ్చారో, ఇచ్చిన విశ్వవిద్యాలయాల ప్రమాణాలేమిటో తెలపాలని ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. విశ్వవిద్యాలయం వారు ఇవ్వను పొమ్మన్నారు. మొదట జనసూచన అధికారి, ఆ తరువాత మొదటి అప్పీలు అధికారి కూడా సమాచారం ఇవ్వలేదు. విధిలేక కేంద్ర సమాచార కమిషన్ ముందుకు రెండో అప్పీల్‌కు వెళ్లవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం వారు ఈ డిగ్రీల సమాచారం మూడో వ్యక్తి సమాచారం అవుతుందని కనుక దాన్ని ఇవ్వజాలమని వివరించారు. సమాచార కమిషన్ ముందుకూడా ఇది థర్డ్ పార్టీ సమాచారమని వాదించారు. సమాచార హక్కు చట్టం కింద మూడో వ్యక్తి సమాచారం అడగడానికి వీల్లేదని కొందరు వాదిస్తుంటారు. కాని చట్టంలో చెప్పేదేమంటే ఒకవేళ జనసమాచార అధికారి ఆ సమాచారం మూడో వ్యక్తి ఇచ్చినదైతే ఆ మూడో వ్యక్తిని సంప్రదించి మీరు ఇచ్చిన సమాచారం పత్రాలు కావాలని అడుగుతున్నారని దీనిపై మీ అభిప్రాయం ఏమి టని అడగవలసి ఉంటుంది. సెక్షన్ 11(1) కింద మూడో వ్యక్తిని సంప్రదించి ఆయన వద్దన్నప్పటికీ, ప్రజాశ్రేయస్సుకోసం అవసరం అనుకుంటే సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. సామాన్యుల డిగ్రీ వివరాలు అడిగిన వారికల్లా ఇచ్చే విశ్వవిద్యాలయాలు, రాజకీయ నాయకుల డిగ్రీ వివరాలు మాత్రం దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాయి. దీంతో ఈ పెద్దల చదువులు నిజమైనవి కాదేమో అని అనుమానం వస్తుంది. ఏమంటారు డాక్టర్ పోక్రియాల్ గారూ? వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నకిలీ విద్యార్హతలు అవినీతి కాదా?
కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఎక్కడ మాట్లాడినా పురాతన విషయాలనే ప్రచారం చేస్తున్నారు. మే 30న మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడే విద్యారంగంలో హిందుత్వ ప్రచారాన్ని ముమ్మరం చేయడానికే ఆయన్ను నియమించినట్లు తెలిసిపోయింది. అప్పటి నుండి అయన అదే పనిలో ఉన్నారు కూడా. గత ఆగస్టు పదో తేదీన బాంబే ఐఐటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ‘ఆయుర్వేద ఆద్యుడు చరకుడే అణువు, కణమును కనిపెట్టాడని, కానీ వాటిని కనిపెట్టింది గ్రీకు తత్వవేత్త డెమోక్రిటిస్ అని పాశ్చాత్యులు ప్రచారం చేసుకున్నార’ని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఆగస్టు 27న ఖరగ్‌పూర్ ఐఐటీ స్నాతకోత్సవ సభలో చేసిన ప్రసంగంలో ‘ప్రపంచంలో మొదటి భాష సంస్కృతమేనని, కాదని ఎవరైనా అనగలరా’ అని సవాల్ చేశారు. ‘సంస్కృతం శాస్త్రీయ భాష అయినందున భవిష్యత్తులో మాట్లాడే కంప్యూటర్లు అంటూ వస్తే అవి సంస్కృత భాషలోనే అని సెలవిచ్చారు. వేదాల కంటే మొదటి గ్రం«థం ఇంకేదైనా ఉందని ఎవరైనా చెప్పగలరా’ అని కూడా ప్రశ్నించారు. ‘శ్రీలంకకు సముద్రంపైన రామసేతు నిర్మించిందెవరు? అమెరికా, బ్రిటన్ ఇంజనీర్లా? భారతీయ ఇంజనీర్లే అని చెప్పాలి కదా. ఇలాంటి విషయాలపై పరిశోధనలు చేసి రుజువు చేయాల్సిన బాధ్యత ఐఐటీయన్లదేన’నీ కర్తవ్యబోధ కూడా చేశారు. ఆగస్టు పదహారున ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతీ ఉత్తాన్ న్యాస్’ నిర్వహించిన జ్ఞానోత్సవ్ కార్యక్రమంలో సైన్స్ టెక్నాలజీలో మనమే ఫస్ట్ అన్నారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ కంటే ముందు మన దేశంలోనే కనిపెట్టారని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి పోఖ్రియాల్ విద్యార్హతల విషయం చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రిగా చేసిన ప్రమాణ పత్రంలో ‘డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్‘ అని పేర్కొనడం తప్పు అని, అందువలన అయన ప్రమాణాన్ని రద్దు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ రెబెల్ లీడర్ మనోజ్ వర్మ రాష్ట్రపతి రామనాథ్ కోవిందుకి ఆగస్టు 27న ఫిర్యాదు చేశారు. ‘ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్, కొలంబో’ నుండి పొందినట్లు హరిద్వార్ నియోజకవర్గం నుండి పోటీకి సమర్పించిన అఫిడవిట్లో రాసుకున్న ‘డాక్టరేట్’ ఫేక్ (నకిలీ) అని వర్మ తన ఫిర్యాదులో ఆరోపిం చాడు. అది పోఖ్రియాల్‌ని బదనాం చేయాలనే దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ మాత్రమేనని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొట్టిపారేస్తున్నా.. దానికి రుజువులున్నాయని వర్మ సవాల్ చేస్తున్నాడు. ఆ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ, డిప్లమాలకు గుర్తింపు లేదని శ్రీలంక యూజీసీనే ప్రకటించిందని, అసలా యూనివర్సిటీని భారత ప్రభుత్వం గుర్తించలేదని వాదించాడు. అంతేకాదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హేమవతీ నందన్ బహుగుణ యూనివర్సిటీ నుండి పొందినట్లు పోఖ్రియాల్ పేర్కొన్న ఎమ్.ఏ. డిగ్రీ కూడా నమ్మదగింది కాదని గతంలో రాజేష్ మధుకాంత్ అనే అతను సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టే ప్రయత్నం చేసిన విషయాన్నీ ప్రస్తావించాడు. ఆ విషయంలో 2016లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఆర్డర్ వేసినా సమాధానం రాలేదనే విషయాన్ని గుర్తుచేశాడు. అవిగాకపోయినా, కేంద్ర విద్యామంత్రికి ఇంకా నాలుగు డిగ్రీలు ఉన్నట్లు ఎంహెచ్ఆర్డీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వివరించినట్లు ’ది ప్రింట్’ వెబ్ పేపర్ పేర్కొన్నది. ఒకవైపు దేశమంతటా అలజడి రేపుతున్న వివిధ యూనివర్సిటీల పేరుతొ వెలువడుతున్న నకిలీ సర్టిఫికెట్ల సమస్యపై విచారణ కమిటీ వేయాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆగస్టు 30న యూజీసీని కోరింది. మరోవైపు విద్యామంత్రి సర్టిఫికెట్లే వివాదంగా మారాయి. అధికారంలో ఉన్నవారిపై వచ్చే ఆర్థిక నేరారోపణలు అలా పక్కనపెట్టండి.. నకిలీ విద్యార్హతలు కలిగి ఉండడం అవినీతి కాదా అనే ప్రశ్నకూడా సమంజసమైందే. విద్యామంత్రి విద్యార్హతలే వివాదంగా మారితే దేశంలో నకిలీ సర్టిఫికెట్ల దందా బంద్ అవుతుందని ఆశించగలమా? వ్యాసకర్త: నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్ : 94903 00577 -
పరీక్షాపత్రాల లీక్.. ప్రధాని ఆగ్రహం!
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షాపత్రాలు లీక్ కావడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడి.. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాలను లీక్‌చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవలని ప్రధాని స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులతో మాట్లాడారు. సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను వాట్సాప్‌లో లీక్ చేశారని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రశ్నాప్రతాల లీకేజ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదుచేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలా పరీక్షాపత్రాలు లీక్ కాకుండా యంత్రాంగం అందుబాటులోకి రావాల్సి ఉందని, ఇందులో భాగంగా పరీక్షాపత్రాలు పంపిణీ చేసే సమయంలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని నిర్ణయించామని జవదేకర్ తెలిపారు. ఇటీవల జరిగిన పదో తరగతి మ్యాథమెటిక్స్, 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకైనట్టు వెలుగుచూసిన నేపథ్యంలో ఆ రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షల తేదీని తమ వెబ్సైట్లో వెల్లడిస్తామని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. -
ప్రశ్నాపత్రంలో కేంద్ర మంత్రి ‘డార్విన్’ వ్యాఖ్యలు..
సాక్షి, పూణే : డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ విమర్శించడంలో తప్పేముందని ఐఐఎస్ఈఆర్ పరీక్షల్లో విద్యార్ధులకు ప్రశ్న ఎదురైంది. విద్యార్థుల తార్కిక ఆలోచనా విధానాన్ని పరిశీలించేందుకే ఈ ప్రశ్నను ప్రశ్నాపత్రంలో జోడించామని సంస్థ డీన్ వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి వాదన ఎందుకు సరైంది కాదో వివరించాలని ప్రశ్నలో విద్యార్థులను కోరామని..ఈ ప్రశ్న మంత్రి ప్రకటనపై కాదని, దాని వెనుక ఉన్న తర్కంపైనే ప్రశ్నించామని ఐఐఎస్ఈఆర్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ డీన్ సంజీవ్ గలాండె తెలిపారు. ఐఐఎస్ఈఆర్లో తర్కబద్ధంగానే బోధన, సాధన ఉంటుందని చెప్పుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై తాము చర్చను చేపట్టలేదని..విద్యార్ధులు తర్కబద్ధంగా వాదించేలా..విభిన్నంగా జవాబులు ఇచ్చేలా ప్రశ్నలు ఉంటాయని అన్నారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం శాస్ర్తీయంగా తప్పు అని..ఇది స్కూల్, కాలేజ్ బోధనాంశాల్లో ఉండరాదని గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సింగ్ పేర్కొన్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆయన తన వైఖరికి కట్టుబడ్డారు. డార్విన్ సిద్ధాంతం సరైంది కాదు...భూమిపై కనిపిస్తున్న మనిషి ఎప్పటికీ మానవుడిగానే ఉన్నాడని..పాఠ్యాంశాల్లో చెబుతున్నట్టు మన పూర్వీకులు ఎవరూ వానరం నుంచి నరుడిగా మారలేదని మంత్రి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
విద్యార్థులతో స్మృతీ ఇరానీ భేటీ
విజయవాడ : కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ మంగళవారం విజయవాడలో పర్యటించారు. అందులో భాగంగా పాతబస్తీలోని గుజరాత్ సమాజ్ స్కూల్‌ను సందర్శించారు. స్కూల్లోని నూతన ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో ఆమె ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఆమెతోపాటు బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, ఆ పార్టీ నాయకులు దగ్గుబాటి పురందేశ్వరీ, మంత్రి కామినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో స్మృతీ ఇరానీ పాల్గొనున్నారు. -
నేడు కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని రాక
విజయవాడ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె నగరంలో పర్యటించనున్నట్లు ఉమామహేశ్వరరాజు తెలి పారు. ఉదయం 11.30 గంటలకు వన్‌టౌన్ కేబీఎన్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో, సాయంత్రం 4గంటలకు ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన వివరించారు. -
అగ్ర కులస్తుడితో ‘రోహిత్’ దర్యాప్తా?
♦ ప్రభుత్వంపై మండిపడిన మాయావతి ♦ కమిషన్‌లో దళితుడిని సభ్యుడిగా చేర్చాలని డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై రాజ్యసభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఇరానీ ప్రకటనతో తాను సంతృప్తి చెందడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో దళితుడికి కూడా స్థానం కల్పించాలని ఫిబ్రవరి 24న తాను కేంద్రాన్ని కోరానని, దానిపై ఇప్పటివరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది’ అని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం కమిషన్‌లో మరో సభ్యుడిని నియమించే అవకాశముందని, అయితే, ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రోహిత్‌కు ఫెలోషిప్‌ను నిలిపివేయడంపై మాయావతి ప్రశ్నించగా.. కొన్ని పత్రాలు రోహిత్ వర్సిటీ అధికారులకు ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారని ఇరానీ బదులిచ్చారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ అని స్పష్టం చేశారు. కాగా, ఫేస్బుక్లో రోహిత్ తనపై చేశాడంటూ ఇరానీ పేర్కొన్న కామెంట్ల ప్రామాణికతను సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఆ ఫేస్బుక్ అకౌంట్ రోహిత్‌దేనని రుజువేమైనా ఉందా? అని అడిగారు. ప్రామాణికతను నిర్దేశించకుండా ఆ కామెంట్లను సభలో ప్రస్తావించడాన్ని ఏచూరి తప్పుబట్టారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకుంటూ.. స్మృతి చదివిన ఆ కామెంట్లను వర్సిటీ రిజిస్ట్రార్ ధ్రువీకరించారన్నారు. సభలో దుర్గామాతపై దూషణలా? హిందువుల దేవతైన దుర్గామాతపై అసభ్యంగా, దూషణపూర్వకంగా రాసిన రాతలను గురువారం సభలో చదివి వినిపించిన ఇరానీపై శుక్రవారం రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. సభకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. జేఎన్‌యూ విద్యార్థుల తీరుపై తాను చేసిన వ్యాఖ్యలకు రుజువులు చూపాలని ప్రశ్నించినందువల్లనే ఆ కరపత్రాలను చదివి వినిపించానని ఇరానీ సమర్థించుకున్నారు. తాను దుర్గామాత భక్తురాలినని చెప్పారు. ‘ఆ కరపత్రాలను సమర్థిస్తుంది.. కానీ వాటిని సభలో చదవడాన్ని మాత్రం తప్పంటుంది’ అని కాంగ్రెస్‌కు చురకలేశారు. అయితే, దైవదూషణకు సంబంధించిన వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు. అంతకుముందు, దైవాన్ని నిందించే వ్యాఖ్యలేవీ సభలో మాట్లాడరాదని రాజ్యాంగం, నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలన్న ప్రతిపాదనతో సభముందుకు వచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభలో ఓడిపోయింది. మోదీకి కూడా ‘మౌనీబాబా సిండ్రోమ్’ లోక్‌సభలో తృణమూల్ సభ్యుడి విమర్శ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌లాగా ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ‘మౌనీ బాబా సిండ్రోమ్’తో బాధపడుతున్నారని టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ వ్యాఖ్యానించారు. రెండు అధికార కేంద్రాలు ఉండటంతో మౌనంగా ఉండే వ్యాధి వస్తుందని, ప్రస్తుతం నాగపూర్‌లో మరో అధికార కేంద్రం ఉండటం వల్ల మోదీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం నాగపూర్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తీర్మానంపై చర్చలో కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడిన 70 నిమిషాలు ప్రధానిని పొగడడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఈ ప్రభుత్వం యూపీఏ 3నా లేక ఎన్డీయే 2నా’? అని జోకులు పేలుతున్నాయన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు కరెన్సీ నోట్ల కట్టలతో వెళ్తున్నారని సుల్తాన్ అహ్మద్ చేసిన ఆరోపణలను హోంమంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యంతో మోదీలో నిస్పృహ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఎన్జీవోలు, బ్లాక్‌మార్కెటీర్లు కుట్రలు చేస్తున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలపై సీపీఎం స్పందించింది. ప్రధానిగా రెండేళ్లు గడవకముందే మోదీలో నిరాశానిస్పృహలు తలెత్తాయని పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’లో రాసిన సంపాదకీయంలో కారత్ పేర్కొన్నారు.రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది. కొన్ని పత్రాలు వర్సిటీ అధికారులకు రోహిత్ ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ. -
రోహిత్ ఆత్మహత్య నన్ను కలచివేసింది
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై శవ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. రోహత్ ఆత్మహత్య తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ ఘటనపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా స్మృతి ప్రసంగించారు. హెచ్‌సీయూ పరిణామాలపై విధి నిర్వహణలో భాగంగానే తాను వీసీకి లేఖలు రాశానని స్మృతి తెలిపారు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పేదిలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఎంపీ కవితలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదని తెలిపారు. హెచ్‌సీయూ ఘటనపై పోలీసులు నివేదిక ఇచ్చారని చెప్పారు. రోహిత్ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా శవరాజకీయాలు చేశారని ఆరోపించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఘటనను రాజకీయ అవకాశంగా వాడుకుంటున్నారని స్మృతి విమర్శించారు. 'నా పేరు స్మృతి ఇరానీ. సవాల్ చేస్తున్నా.. నా కులం ఏంటో చెప్పండి' అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. -
‘పరువు నష్టం’పై రాజీ పడండి..
స్మృతి ఇరానీ, సంజయ్ నిరుపమ్‌లకు సూచించిన ఢిల్లీ కోర్టు న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్‌లు పరస్పరం దాఖలు చేసిన పరువునష్టం దావాలపై రాజీ పడాలని ఢిల్లీ కోర్టు శనివారం సూచించింది. నిరుపమ్ తరఫున న్యాయవాది రాజీకి సిద్ధ పడగా, స్మృతి తరఫు న్యాయవాది అంగీకరించలేదు. దీంతో ఆగస్టు ఒకటిన విచారణ జరుపుతామని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధీరజ్ మిట్టల్ తెలిపారు. 2012 గుజరాత్ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన టీవీ చర్చలో తనను స్మృతి దుర్భాషలాడారని సంజయ్ నిరుపమ్ పరువునష్టం దావా వేశారు. ఇదే విషయంపై స్మృతి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఎంసెట్ విడిగానా? ఉమ్మడిగానా?
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం ఏపీ ఇంటర్ బోర్డు సమావేశం జరిగింది. ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదని సమావేశంలో గంటా పేర్కొన్నారు. అందువల్ల తప్పని పరిస్థితుల్లో పరీక్షలు విడిగా నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులతో చర్చించామన్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చే ఏర్పాట్లపై ఆలోచిస్తున్నామన్నారు. ఇంటర్ పరీక్షల్లాగే ఎంసెట్ పరీక్షల్లోనూ తెలంగాణ ప్రభుత్వం బెట్టు చేస్తోందని దుయ్యబట్టారు. ఎంసెట్ ను విడిగా నిర్వహించాలా? లేక ఉమ్మడిగా నిర్వహించాలా? అనే దానిపై అధికారులతో సమాలోచనలు జరుపుతున్నామన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గంటా తెలిపారు. -
పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న విశాఖ ఉత్సవానికి థీమ్ సాంగ్ రాసేందుకు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరాకరించినట్లు సమాచారం. ఈ ఉత్సవం కోసం థీమ్ సాంగ్ రాయాలని నిర్వాహాకులు సిరివెన్నెలను సంప్రదించగా అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఈ ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో థీమ్ సాంగ్ కోసం నిర్వహాకులు థీమ్ సాంగ్ రాయించేందుకు స్థానికంగా ఉన్న గీత రచయితలను సంప్రదిస్తున్నారని సమాచారం. అయితే విశాఖ ఉత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తామని భీమిలి ఎమ్మెల్యే, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో వెల్లడించారు. అందుకోసం ప్రముఖ గీత రచయితతో థీమ్ సాంగ్ రాయిస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉత్సవం జనవరి 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. -
స్మృతి సరే... రాజీవ్ 'జాతకం' సంగతేంటి?
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ జ్యోతిష్యుడ్ని కలవడంపై రాద్ధాంతం చేసిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై దాడికి కాషాయం పార్టీ తన అంబుల పొదలో నుంచి సరికొత్త ఆయుధాన్ని వెలికి తీసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కోసం ఆయన తాత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జాతక చక్రం వేయించాలని తన సోదరి కృష్ణ హతిసింగ్ కి 1944, ఆగస్టు 29వ తేదీన రాసిన లేఖను బీజేపీ బుధవారం వెలుగులోకి తీసుకువచ్చింది. ఇదే అంశంపై నెహ్రు తన కుమార్తె ఇందిరకు కూడా లేఖ రాశారని బీజేపీ పేర్కొంది. కాగా నవంబర్ 25వ తేదీన స్మృతి ఇరానీ తన భర్తతో కలిసి రాజస్థాన్‌లోని భిల్వారాలో జ్యోతిష్కుడిని కలిశారు. ఈ సందర్భంగా ఆ జ్యోతిష్కుడు స్మృతి భవిష్యత్తులో దేశానికి అధ్యక్షురాలు అవుతారని చెప్పారని కథనాలు వెలువడ్డాయి. స్మృతి ...జ్యోడిష్యుడిని కలవటంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ జాతకంపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. -
నా పనితీరు చూసి చెప్పండి: స్మృతి
న్యూఢిల్లీ: తన విద్యార్హతకు సంబంధించిన వివాదంపై మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మౌనం వీడారు. తన పనితనం చూసి ఆ తర్వాత న్యాయం చెప్పాలని రాజకీయ నాయకురాలిగా మారిన ఈ టీవీ నటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కనీసం గ్రాడ్యుయేట్ కూడా కాని స్మృతి మానవ వనరుల శాఖను ఎలా నిర్వహించగలరంటూ కాంగ్రెస్ విమర్శించిన రెండురోజులకు ఆమె స్పందించారు. తనకు అప్పగించిన బాధ్యతల నుంచి తన దృష్టిని మళ్లించేందుకు సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2004, 2014 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసిన ఆమె పరస్పర విరుద్ధమైన అఫిడవిట్లు దాఖలు చేసిన విషయం వెలుగుచూడటంతో.. తన విద్యార్హతకు సంబంధించి తలెత్తిన వివాదానికి స్మృతి కేంద్ర బిందువుగా మారారు. -
వివాదం పక్కన పెట్టి పనితీరు చూడండి: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: విద్యార్హతలపై కొనసాగుతున్న వివాదంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పెదవి విప్పారు. తన విద్యార్హతలను లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ సృష్టించిన వివాదం విధులపై దృష్టి పెట్టకుండా చేసిందని.. అయితే తన పనితీరును ప్రజలు తీర్పు ఇవ్వాలని స్మృతి విజ్క్షప్తి చేశారు. డిగ్రీ పట్టాలేని వ్యక్తికి కీలక శాఖను అప్పగించడంపై కాంగ్రెస్ సృష్టించిన వివాదంపై స్పందిస్తూ విద్యార్హతలను పక్కన పెట్టి పనితీరు చూడాలని ఆమె కోరారు. 2004, 2014 లోకసభ ఎన్నికల్లో విద్యార్హతలుగా వివిధ రకాలుగా అఫిడవిట్ లో దాఖలు చేయడంతో మధు కుష్వర్ అనే ఓ సామాజిక కార్యకర్త ..12వ తరగతి పాస్ కాని వ్యక్తికి మానవ వనరుల శాఖ ఇవ్వడమా అంటూ ప్రశ్నించారు. ఆతర్వాత కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ రంగు పులుముకుంది. -
కీలక సమావేశానికి పళ్లంరాజు దూరం
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి పళ్లంరాజు గురువారం కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర అంశాలను సమీక్షించడానికి సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, విద్యా రంగ నిపుణులు పాల్గొంటున్నారు. పళ్లంరాజు గైర్హాజరీలో ఆ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద అధ్యక్షత వహిస్తున్నారు. పళ్లంరాజు రాజీనామా సమర్పించిన తర్వాత పలు సమావేశాలకు అధికారులే హాజరవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆయన లేనికారణంగా పలు సమావేశాలు రద్దయ్యాయి. కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా గైర్హాజరైన మంత్రి రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇటీవల కలిసి రాజీనామాలను అంగీకరించాల్సిందిగా కోరినా ఆయన వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.