రోహిత్ ఆత్మహత్య నన్ను కలచివేసింది
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై శవ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. రోహత్ ఆత్మహత్య తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్సీయూ ఘటనపై బుధవారం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా స్మృతి ప్రసంగించారు.
హెచ్సీయూ పరిణామాలపై విధి నిర్వహణలో భాగంగానే తాను వీసీకి లేఖలు రాశానని స్మృతి తెలిపారు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పేదిలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఎంపీ కవితలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదని తెలిపారు. హెచ్సీయూ ఘటనపై పోలీసులు నివేదిక ఇచ్చారని చెప్పారు. రోహిత్ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా శవరాజకీయాలు చేశారని ఆరోపించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఘటనను రాజకీయ అవకాశంగా వాడుకుంటున్నారని స్మృతి విమర్శించారు. 'నా పేరు స్మృతి ఇరానీ. సవాల్ చేస్తున్నా.. నా కులం ఏంటో చెప్పండి' అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.