కాంగ్రెస్ అకౌంటునూ హ్యాక్ చేసేశారు!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంటును హ్యాక్ చేసినవాళ్లే.. కాంగ్రెస్ పార్టీ అకౌంటును కూడా హ్యాక్ చేశారు. రాహుల్ అకౌంటు నుంచి వాళ్లు పోస్ట్ చేసిన ట్వీట్లను తొలగించిన కాసేపటికే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ట్విటర్ అకౌంటుమీద పడ్డారు. అక్కడ సైతం పలు అభ్యంతరకరమైన ట్వీట్లు పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా ఇందులో ఒకటి రెండు ట్వీట్లు ఉన్నాయి.
ఆటిజం కోసం ప్రత్యేకమైన క్లాసులు ఏమైనా కావాలా అంటూ రాహుల్‌ను ప్రశ్నించారు. క్రిస్మస్ స్పెషల్‌గా మరో దాడి చేస్తామని ముందుగానే హెచ్చరించారు. మీ పార్టీని కుప్పకూల్చేందుకు కావల్సినంత సమాచారం తమవద్ద ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పంపిన ఈమెయిళ్లన్నింటినీ బయట పెడతామన్నారు. తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. తమకు ఎలాంటి రాజకీయ ఎజెండా మాత్రం లేదని స్పష్టం చేశారు.
కాగా, రాహుల్ అకౌంటును, తమ పార్టీ అకౌంటును హ్యాక్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసులకు ఫిర్యాదుచేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్లమెంటు ఉభయ సభలలోను ప్రస్తావిస్తామని కూడా అన్నారు.
