రాయ్‌పూర్ : ఉపాధి కోసం, చదువు కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవారి గురించి విన్నాం.. కానీ విధి నిర్వహణ కోసం, నిరుపేదలకు వైద్య సేవలు అందించడం కోసం ఓ నర్సు ప్రతి రోజూ సుమారు 10 కి.మీ. మేర కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. మొసళ్లకు ఆవాసమైన నదిని కూడా లెక్కచేయకుండా వెళ్లి గ్రామీణులకు వైద్యం అందిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయకమైన కథనమిది..
సునిత ఏఎన్‌ఎమ్ నర్సు. మావోయిస్టుల ప్రభావమున్న ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. తాను ఉంటున్న ప్రదేశం నుంచి మారుమూల గ్రామమైన దంతేవాడ చేరుకోవాలంటే ఆమె ప్రతిరోజు ఇంద్రావతి నదిని దాటి వెళ్లాలి. ఆ నది మొసళ్లకు ప్రసిద్ధి. అయినా ఆమె భయపడలేదు. ప్రతిరోజు ఒంటరిగానే నాటుపడవ సహాయంతో నదిని దాటుకుని వెళ్లి గ్రామ ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. గత ఏడేళ్లుగా ఆమె ఈ విధంగా పల్లె ప్రజలకు చెంతకు వైద్యాన్ని తీసుకెళుతున్నారు.
అది నా బాధ్యత...
‘‘నా విధులు నిర్వహించడానికి నేను ప్రతిరోజు దట్టమైన అడవిని, ఇంద్రావతి నదిని దాటుకుని వెళ్తాను. ఇది నాకు పెద్ద శ్రమ అనిపించడంలేదు. ఆ మారుమూల గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు సేవ చేయడం నాకు చాలా సంతృప్తినిస్తుంది’’ అన్నారు సునిత.
Comments
Please login to add a commentAdd a comment