
ఆప్‌ను పీడిస్తున్న సందీప్ 'అశ్లీలం'
పనాజి: ఆమ్‌ఆద్మీ పార్టీని సందీప్ వీడియో వ్యవహారం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆప్‌ను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు సందీప్ అశ్లీల వీడియో దృశ్యాలను అస్త్రంగా వాడుతున్నారు. ఇప్పటికే పలువురు కళంకిత నేతలతో పరువుపోగొట్టుకున్న ఆప్.. సందీప్ వ్యవహారంతో పూర్తిగా ఇరుకునపడినట్లైంది. 'ఆప్ 18 డైమండ్స్' అంటూ ఆప్ కళంకిత నేతల చిత్రాలు, వారి చర్యలతో కూడిన పోస్టర్లను పంజాబ్‌లో ప్రచారం చేయాలని బీజేపీ-అకాళీదళ్ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.
తాజాగా గోవా అంతటా సందీప్ నగ్న వీడియోకు సంబంధించిన పోస్టర్లు కనిపించడంతో స్థానిక ఆప్ నేతలు బిత్తరపోయారు. సందీప్ పోస్టర్లపై ఆప్ ఎన్నికల గుర్తును కూడా ముద్రించడం పట్ల గోవా ఆప్ కన్వినర్ వాల్మికి నాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపిన ఆయన.. ఇది బీజేపీ నాయకుల చర్యగా అనుమానం వ్యక్తంచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో 40 సీట్లలో పోటీచేయడానికి ఆప్ కసరత్తులు పూర్తిచేసుకుంది. అయితే ఆ పార్టీ నేతల కళంకిత వ్యవహారం ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.