మరోసారి రాందేవ్ పతంజలి మాయ!
న్యూఢిల్లీ: మరోసారి యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద చర్చలోకి వచ్చారు. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్న ఆయనకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఈసారి పెద్ద చర్చకే తెరతీసింది. ఏడు నెలల తర్వాత విడుదల చేయాల్సిన ఒక కేజీ పరిమాణంలో తయారు చేసిన పతంజలి 'అలా మురబ్బా' మెడిసిన్ ప్యాకెట్లను ముందుగానే విడుదల చేసి అందరినీ అనుమానంలో పడేసింది. దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్ డీఏ) ఎలా అనుమతిచ్చిందో కూడా అర్థంకానీ పరిస్థితి తయారైంది.
ఉత్తరాఖండ్లో కేజీ పరిమాణంలో అలా మురబ్బా మెడిసిన్ ప్యాకెట్లను పతంజలి సంస్థ విడుదల చేసింది. అయితే, ఆ ప్యాకెట్లపై తయారీ తేదీ 20 అక్టోబర్ 2016గా పేర్కొనగా.. కాలపరిమితి అక్టోబర్ 19, 2017గా ముద్రించారు. ప్రస్తుతం మార్చిలోనే ఉండగా ఇంకా ఏడు నెలల సమయం తర్వాత విడుదల చేయాల్సిన ప్యాకెట్లను ఇప్పుడెలా విడుదల చేశారనేది ప్రశ్నగా కనిపిస్తోంది. అసలు దానిని నాణ్యతప్రమాణాలపై కూడా పలు అనుమానాలు కలుగుతున్నాయి.
సాధారణంగా.. ఒక వస్తువు మార్కెట్లోకి రావడానికంటే ముందు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్ డీఏ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా అనుమతిచ్చే ఎఫ్ఎస్ డీఏ ఈ అంశాన్ని గుర్తించకపోవడం మరోసారి విమర్శలకు తావిస్తోంది. అయితే, అసలు తాము ఆ ప్రొడక్ట్ కు అనుమతివ్వలేదని, క్వాలిటీ పరీక్షల్లో కూడా విఫలమైందని ఎఫ్ఎస్డీఏ చెప్తోంది. అంతేకాకుండా ఈ ప్రొడక్ట్ను క్వాలిటీ పరీక్షలు నిర్వహించగా ఇందులో సోనా పాపిడి, ఆవు పాలతో చేసిన నెయ్యి, పసుపు లవణాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఈ విషయం తెలిసి ఉత్తరాఖండ్ ఆయుర్వేదిక్ శాఖ కూడా వాటిన బ్యాన్ చేసి పరీక్షలకోసం ల్యాబ్ లకు పంపించింది.