భువనేశ్వర్: ఒడిశాలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నాయి. మహా విషుభ సంక్రాంతిగా పిలిచే ఒడిశా కొత్త సంవత్సర పండుగ సందర్భంగా వివిధ దేవాలయాల్లో పూజలతోపాటు పూరి జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మహావిషుభ సంక్రాంతికి స్వాగతం పలుకుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
విషుభ సంక్రాంతి లేదా పాన సంక్రాంతిగా పిలిచే పండుగను ఒడిశా ప్రజలు సంవత్సరాదిగా జరుపుకుంటారు. కొత్త ఒడియా అల్మానాక్ అమల్లోకి వచ్చే ఈ రోజును ప్రత్యేక వేడుకగా నిర్వహిస్తారు. తెలుగు ప్రజలు సంవత్సరాదినాడు షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని తయారుచేసి తినే ఆచారం ఉన్నట్లుగానే ఒడిశాలోనూ నూతన సంవత్సరారంభం రోజున పానా గా పిలిచే పచ్చిమామిడి, చక్కెర కలిపిన రసాన్ని తాగుతారు.
మరోవైపు అనేకమంది రాజకీయ పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు, విపక్షాల నాయకులు, ప్రముఖులు ఒడిషా ప్రజలకు కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. దీంతో పాటు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడ నిర్వహించారు. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948 ఏప్రిల్ 13న రాష్ట్ర రాజధానిగా భువనేశ్వర్ నగరానికి తొలి పునాది రాయి వేశారు.
ఒడిశాలో నూతన సంవత్సర వేడుకలు!
Published Wed, Apr 13 2016 5:35 PM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM
Advertisement