
భువనేశ్వర్: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాలకు వెంటనే అమలు చేయాలని కోరుతూ ఒడిశా యువకుడు ఏకంగా 1350 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాడు. కాలి నడకన ఢిల్లీ వెళ్లి మోదీని కలవడానికి బయలుదేరాడు. వృతిపరంగా విగ్రహాలు తయారు చేసే ముక్తికాంత్ బిస్వాల్(30) శనివారం జాతీయ జెండా చేతపట్టుకుని ఒడిశా నుంచి ఢిల్లీకు తన నడక ప్రారంభించారు. ఈ సందర్భంగా బిస్వాల్ మాట్లాడుతూ.. ‘2015లో మోదీ ఒడిశా పర్యటనకు వచ్చినప్పుడు రూర్కెలాలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, బ్రాహ్మిణి వంతెన పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. రూర్కెలా ప్రజలకు ప్రధాన ఆసుపత్రి అయిన ఇస్పత్ ఆసుపత్రిని పునరుద్దరిస్తామని కూడా హామీ ఇచ్చారు.
మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైనా హామీలను అమలు చేయలేదు. వైద్య సదుపాయం లేక ప్రజలు చనిపోతున్నారు. కాలినడకన 1350 కిలోమీటర్లు నడిచి ఢిల్లీలో మోదీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నా’నని అన్నారు. బిస్వాల్ పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని చేసిన వాగ్దానాలకు నెరవేర్చాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా శనివారం నడక ప్రారంభించిన బిస్వాల్ ఆగ్రా ప్రధాన రహదారిపై సొమ్మసిల్లి పడపోవడంతో స్థానికులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment