భువనేశ్వర్ : పెళ్లి కూతురు అలంకరణలో మమత భోయ్ మెరిసిపోతుంది. మరి కొద్ది క్షణాల్లో తాను నూతన జీవితంలోకి ప్రవేశించబోతున్నాననే ఆలోచనతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. పచ్చని పందిరి మమత నూరేళ్ల జీవితానికి సాక్ష్యమన్నట్లు నిలిచింది. నిండు నూరేళ్లు చల్లగా బతకమని ఆశీర్వదించడానికి తన బంధువులంతా తరలి వచ్చారు. మరి కాసేపట్లో మాంగళ్యధారణ జరుగనుంది. ఈ లోపు వరుడు మంటపానికి వచ్చాడు.. సారి తీసుకొచ్చారు. అతడిని చూస్తే.. పెళ్లి కొడుకు అనే అభిప్రాయం అక్కడున్న ఎవరికి కలగడం లేదు. వరుడు సమీపిస్తోన్న కొద్ది మందు వాసన గుప్పుమంటోంది.
మత్తులో తూగుతూ.. స్థిరంగా నిలబడేందుకు కూడా లేక పోవడంతో నలుగురు వ్యక్తులు కలిసి అతడిని మంటపానికి తీసుకొచ్చారు. బంధువులతో పాటు మమత కూడా అతని వాలకానికి ఆశ్చర్యపోయింది. ఇలాంటి వ్యక్తితోనా తాను జీవించబోయేది అనుకుంది. వెంటనే ఓ నిర్ణయానికొచ్చింది. తాను ఈ పెళ్లి చేసుకోబోవడం లేదంటూ మంటపం నుంచి వచ్చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె నిర్ణయాన్ని ఆమోదించారు. విషయం కాస్తా జిల్లా అధికారులకు తెలిసింది. వారు మమత చూపిన తెగువను మెచ్చుకుంటూ రూ. 10 వేల నగదు బహుమతిని అందజేశారు. మమత ధైర్యం ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ఈ విషయం గురించి మమత మాట్లాడుతూ.. ‘మత్తులో జోగుతున్న పెళ్లి కొడుకును చూడగానే ఇతనితో కలిసి జీవితాంతం ఎలా బతకాలి అనిపించింది. ఆ క్షణమే అతడిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా నాకు మద్దతుగా నిలిచారు. అందుకు వారికి ధన్యవాదాలు’ అన్నారు మమత. ఆమె చూపిన చొరవను ప్రశంసిస్తూ.. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నాడు ప్రభుత్వం మమతా భోయ్‌ను ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment