
సాక్షి, టీ.నగర్: తమిళనాడు దివంగత సీఎం జయలలితకు కుమార్తె ఉన్నట్లు చెప్పడాన్ని సీనియర్ నటి లత ఖండించారు. మదురై జిల్లా ఎంజీఆర్ అభిమాన సంఘం నిర్వహించే ఎంజీఆర్ వందేళ్ల వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె మదురై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకేలో ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని, వ్యక్తిగత కుటుంబ ఆధిపత్య వివాదాలు దాటి బయటికి వచ్చారని, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పాలన ఐదేళ్లు కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. జయలలితకు కుమార్తె ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని, ఈ విషయం తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. జయలలిత మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఈ ప్రశ్నలెందుకు లేవనెత్తలేదని అన్నారు.
జయలలిత ధైర్యవంతురాలని, కుమార్తె ఉన్నట్లయితే ధైర్యంగా ఒప్పుకునేవారని తెలిపారు. జయలలిత ఆస్తులను పొందేందుకు అమృతను వెనుక నుంచి ఎవరో నడిపిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. నటుడు విశాల్ మాత్రమే కాదు, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తానని తెలిపారు. విశాల్‌ను ఎవరైనా వెనుక నుంచి నడిపిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆ విషయం తెలియదని లత సమాధానమిచ్చారు. ఆయన ప్రజలకు విశ్వాసపాత్రుడిగా పేరొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆర్‌కేనగర్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే ఆహ్వానిస్తే ప్రచారం చేస్తానన్నారు.
ముందే ఎందుకు చెప్పలేదంటే..
జయలలిత కుమార్తె అనే విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదనే విషయంపై అమృత ఓ ప్రైవేటు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనను పెంచిన తల్లి 2015లో మృతి చెందారని, పెంచిన తండ్రి పార్థసారథి 2017 మార్చిలో మృతి చెందినట్లు తెలిపారు. తాను జయలలిత కుమార్తె అనే విషయాన్ని పెంపుడు తండ్రి చనిపోతూ తెలపడంతో దీన్ని ధ్రువపరచుకోలేకపోయానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment