శ్రీనగర్‌లో దిగిన టాప్ సీక్రెట్ విమానం!
శ్రీనగర్: ఊహించనివిధంగా, ఉన్నపళాన ఓ టాప్ సీక్రెట్ విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది. ఒక్కసారిగా దిగిన ఈ విమానాన్ని ట్రాక్ చేసిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇంతకు ఆయన వ్యక్తం చేసిన అనుమానం రాజకీయమైనది. బీజేపీ-పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుపై రహస్యంగా ఏదో గూడుపుఠాణి జరుగుతున్నదంటూ ఒమర్ ఈ మేరకు ట్విట్టర్‌లో అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేత రాంమాధవ్ బుధవారం సాయంత్రం శ్రీనగర్ వచ్చి.. పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్స్ చేశారు.
నిజానికి బీజేపీ నేత రాంమాధవ్ కనీసం జర్నలిస్టులకు కూడా చెప్పాపెట్టకుండా శ్రీనగర్‌లో దిగారు. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే భారత రాజకీయ నేతల్లో ఒకరైన ఒమర్.. తన మొబైల్ లోని ట్రాకర్ యాప్‌తో వేళ కాని వేళ అనూహ్యంగా శ్రీనగర్‌లో దిగిన చార్టర్ విమానాన్ని పట్టేశారు. దీని గురించి వెంటనే ఆయన ట్వీట్ చేశారు. 'మామూలు ఆపరేషన్స్ సమయంలో కాకుండా ఓ అన్‌షెడ్యూల్ విమానం శ్రీనగర్‌లో దిగింది. పీడీపీ-బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏదో గూడుపుఠాణి జరుగుతున్నది' అని ఆయన పేర్కొన్నారు. మెహబూబా-రాం మాధవ్ రహస్య భేటీ గురించే ఈ అనూహ్య విమానం దిగిందని ఓ నెటిజన్ బదులివ్వగా.. ఫ్లయిట్ ట్రాకర్ యాప్ ఇచ్చిన అమేజింగ్ అలర్ట్‌తో దీనిని పట్టేశానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.