శ్రీనగర్: జమ్మూ-కశ్మీరులో అల్లరి మూకలు రోజురోజూకి రెచ్చిపోతున్నారు. ఏదో ఒక నెపంతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మానవత్వం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని స్కూలు చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపై బుధవారం ఉదయం అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. కాగా ఒక్కసారిగా రాళ్లదాడి జరగడంతో విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పరుగులు పెట్టారు.
గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ..రెయిన్‌బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుపై దాడి జరిగిన సమయంలో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వీరంతా దాదాపు నాలుగేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసువారేనని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిపై జరిగిన దాడి మానవత్వానికే వ్యతిరేకమని అన్నారు. ఎవరి బిడ్డకైనా ఇలా జరగవచ్చునన్నారు. మరోవైపు ఈ ఘటనను ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ, ప్రతిపక్షనేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు. పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ హామీ ఇచ్చారు.
రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment