వచ్చే గురువారానికి వాయిదా వేసిన ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఓఎంసీ ఇనుప గనుల అక్రమ తవ్వకం కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో అరెస్టయి ఆ తర్వాత బెయిల్ పొందిన నిందితులకు ఆ బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం విచారించింది. నిందితుల్లో కొందరికి బెయిల్ మంజూరు చేసి తనకు మంజూరు చేయలేదని, తనకు కూడా బెయిల్ ఇప్పించాలని మరో నిందితుడు యాదగిరి రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించింది.
2012 మే నెలలో ఈ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ట్రయల్ కోర్టు కొందరికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఏసీబీ హైకోర్టులో సవాలు చేయగా.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంటూ మరికొందరు నిందితులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిందితులకు బెయిల్ రద్దు చేయాలని అభ్యర్థించింది.
ప్రభుత్వం, యాదగిరి రావు ఫిర్యాదులను విచారణకు స్వీకరించిన జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం, ఒకే కేసులో ఒకే ఆరోపణపై కొందరు నిందితులకు బెయిల్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం ఏంటని, ఈ కేసు విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోందని వ్యాఖ్యానించింది. కాగా ట్రయల్ కోర్టుకు ఐదు నెలలుగా న్యాయమూర్తి లేరని ప్రభుత్వం వివరించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
ఓఎంసీ బెయిల్ ముడుపుల కేసు వాయిదా
Published Fri, Aug 29 2014 3:14 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement