ఉస్మానాబాద్(మహారాష్ట్ర) : ఎన్నికల ప్రచారంలో ఉన్న శివసేన ఎంపీ ఓంరాజే నింబల్కర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. అయితే కత్తి ఓంరాజే చేతికి తలగడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన బుధవారం ఉదయం ఉస్మానాబాద్ పరిధిలోని కలాంబ్ తాలుకాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన అభ్యర్థి కైలాశ్ పాటిల్ తరఫున ఓంరాజే ప్రచారం చేపట్టారు.
అయితే పడోలి నైగాన్ గ్రామంలో ఓంరాజే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పలువురు పార్టీ నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఎంపీపై కత్తితో దాడికి పాల్పడాడు. ఆ కత్తి ఎంపీ చేతికి ఉన్న వాచ్‌కు తగలడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. అనంతరం ఎంపీని.. శివసేన శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఓంరాజే తండ్రి పవన్‌రాజే నింబల్కర్ జూన్ 3, 2016 హత్యకు గురయ్యారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవే ఆయన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు కాల్చిచంపారు. ఈ కేసులో మాజీ ఎంపీ పాదమ్‌సిన్హా పాటిల్ కీలక నిందితుడిగా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న జరగనుండగా.. ఫలితాలు 24న వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment