అమరుల కుటుంబాలకు కోటి
హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
నాథులా(సిక్కిం) : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారాన్ని అందిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) శరాతంగ్ పోస్ట్‌లో శనివారం నిర్వహించిన ‘సైనిక్ సమ్మేళన్’లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం పారామిలిటరీ బలగాల్లోని 84,000 కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించినట్లు ప్రకటించారు. జవాన్ల త్యాగాలకు వెలకట్టలేమని రాజ్‌నాథ్ తెలిపారు.
అమరుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే రూ.కోటి నష్ట పరిహారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు భారత్–చైనా సరిహద్దును సందర్శించిన రాజ్‌నాథ్ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఐటీబీపీ బలగాలు తమ సమస్యల్ని చెప్పుకోవడానికి హోంశాఖ రూపొందించిన యాప్ పనితీరును జవాన్లను అడిగి తెలుసుకున్నారు. పర్వత ప్రాంతాల్లో పనిచేసే జవాన్లకు భత్యాల చెల్లింపులో సమానత్వంపై దృష్టి సారిస్తామని రాజ్‌నాథ్ హామీనిచ్చారు.