సాక్షి, చెన్నై : వయసులోనే కాదు.. మానవతా ధోరణిలోనూ ఆమెది పెద్ద మనస్సు. లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకుని కొందరు వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకునే ఈ రోజుల్లో ఎనిమిది పదులు దాటిన ఆ వృద్ధురాలు ప్రజల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. పలువురి ఆకలితీరుస్తున్నారు. కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరు యూనియన్ పరిధిలోని వడివేలాంపాళయంలో కమలాతాళ్ (85) అతిచిన్నదైన టిఫిన్ సెంటర్‌ను నడుపుతున్నారు. మూడు దశాబ్దాలుగా పొయ్యిలోనే వంటలు వండుతూ కేవలం రూపాయికే రుచికరమైన ఇడ్లీని అందిస్తున్నారు. వందలాది మందికి వృద్ధురాలు తయారు చేసే ఇడ్లీ అంటే ఎంతో మక్కువ. కరోనావైరస్ భీతి, లాక్‌డౌన్ అంక్షల రోజుల్లోనూ ఆమె టిఫిన్ సెంటర్‌ను నడుపుతున్నారు. ఇంతటి కష్టదినాల్లో సైతం విరామం లేకుండా టిఫిన్ సెంటర్ నడపడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ వీడియోకాల్ ద్వారా ఆమెతో మాట్లాడి అభినందనలు తెలిపారు. మీ సేవలు ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు.
(చదవండి : రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె)
దీంతో గ్రామంలోని ఇతర డీఎంకే నేతలు నెలరోజులకు సరిపడా బియ్యం, పప్పుధాన్యాలు, కూరగాయలు వృద్ధురాలికి అందజేశారు. పొల్లాచ్చి పార్లమెంటు సభ్యుడు షణ్ముగానందం గ్రైండర్ కొనుగోలుకు రూ.10 వేలు ఆర్థికసాయం చేశారు. పొయ్యితోనే ఆమె టిఫిన్‌సెంటర్ నడుపుతున్న నేపథ్యంలో.. గ్యాస్ స్టౌ కనెక్షన్‌కు తొండాముత్తూరు యూనియన్ డీఎంకే కార్యదర్శి సేనాధిపతి ఆర్థిక సహాయం అందజేశారు. స్టాలిన్ సోమవారం రెండోసారి ఆ వృద్ధురాలితో వీడియో కాల్ ద్వారా సంభాషించి డీఎంకే నేతలు అందిస్తున్న సహాయంపై ప్రశ్నించారు. స్టాలిన్‌తో మాట్లాడటం తన జీవితంలో మరపురాని అనుభవమని ఆమె ఆనందాన్ని వెలిబుచ్చారు.
(చదవండి : మానవత్వం చాటుకున్న బాలవ్వ..)
‘లాక్‌డౌన్ కారణంగా మినపప్పు ధర రూ.100 నుంచి రూ.150కి పెరిగిందని, చట్నీ తయారీకి అవసరమైన వేరుశనగపప్పు, మిరపకాయలు ధరలు సైతం కిలోపై రూ.50 వరకు పెరిగింది. అయినా రూపాయికే ఇడ్లీలు అమ్ముతు న్నా. లాక్‌డౌన్ సమయంలోనూ రోజుకు సుమారు 300 మంది ఇడ్లీలు కొనుక్కుని పోతున్నారు. లాక్‌డౌన్, వస్తువుల ధరలు పెరిగాయి కదాని ఇడ్లీలు చేయకుంటే నన్ను నమ్ముకుని వచ్చేవారంతా పాపం ఎక్కడికి పోతారు’ అని ఆమె చెప్పిన మాటలు అధికధరలతో దోచుకునేవారికి చెంపపెట్టు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment