మాటల గారడే.. ముందుచూపు లేదు!
ఉపాధి కల్పనకు ఊతమేది?: విపక్షం
దార్శనిక, ప్రగతిశీల బడ్జెట్: బీజేపీ
న్యూఢిల్లీ : బడ్జెట్ పేదల అనుకూలమని ప్రభుత్వం చెప్పడం ఒట్టి మాటల గారడేనని విపక్షం మండిపడింది. ఉత్తుత్తి హామీలతో రైతులను మోసం చేయలేరని హెచ్చరించింది. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి తీవ్ర సమస్యలకు పరిష్కారం దిశగా తక్షణ ఉపాధి అవకాశాల కల్పనలో బడ్జెట్ విఫలమైందని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు మండిపడ్డాయి. సామాన్యులను గాలికొదిలేసి పారిశ్రామికవేత్తలకు, విదేశీ పెట్టుబడిదారులకు పెద్దపీట వేశారని, నల్లధనవంతులకు మేలు చేశారని దుయ్యబట్టాయి.
ప్రభుత్వానికి పెద్ద ఆలోచనేదీ లేదని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ విమర్శించారు. ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని వ్యర్థం చేసుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రెండేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం పల్లెసీమలను, సాగును నిర్లక్ష్యం చేసిందని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ధ్వజమెత్తారు. ‘సంస్కరణ అంటే మార్కెట్ శక్తులను, ఉత్పత్తి మార్కెట్లను సంస్కరించడం. అలాంటిది బడ్జెట్‌లో కనిపించలేదు. ప్రభుత్వం హౌజ్‌కీపింగ్, అకౌంటింగ్‌కే పరిమితమైంది’ అని అన్నారు. అయితే బడ్జెట్ ముందుచూపుతో, ప్రగతిశీలంగా ఉందని అధికార బీజేపీ కొనియాడింది. రైతులు, పేదలు, యువత సాధికారతకు ఇది బాటలు వేసిందని కొనియాడింది.
కలగూరగంపలా..
బడ్జెట్ కలగూరగంపలా ఉంది. గొప్ప ఆలోచనేదీ లేదు. అనవసర విమర్శలకు ప్రాధాన్యమిచ్చారు. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అసాధ్యం. ఎలా సాధ్యం చేస్తారో చెప్పలేదు ఆ లక్ష్యం నెరవేరాలంటే ఏదేళ్లపాటు విదేశీ ఆదాయం ఏటా 14 శాతం పెరగాలి.
-మన్మోహన్‌సింగ్(మాజీ ప్రధాని)
కార్పొరేట్లకు లక్షల కోట్లు..
లక్షల కోట్లను కార్పొరేట్ల కోసం, బిల్డర్ల కోసం కేటాయించారు. సామాన్యుల, మధ్యతరగతి ప్రజల కలలను భగ్నం చేశారు.
-నవాబ్ మాలిక్(ఎన్సీపీ)
దార్శనికత లేదు
బడ్జెట్‌లో దార్శనికతలేదు. అన్నీ ఉత్తుత్తి హామీలు. పరోక్ష పన్నులతో సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం పడుతుంది. ప్రజలపైకంటే విదేశీ పెట్టుబడులపైనే ఎక్కువ దృష్టి సారించారు.
-సీతారాం ఏచూరి (సీపీఎం ప్రధాన కార్యదర్శి)
మధ్యతరగతిని మోసం చేశారు
రైతుల, మధ్యతరగతి ప్రజల ఆందోళనను పట్టించుకోలేదు. వారిని మోసం చేశారు. పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసినట్లే, రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేదు? తమకు ఓట్లేసిన మధ్యతరగతిని మోదీ వంచించారు.
-అరవింద్ కేజ్రీవాల్(ఢిల్లీ సీఎం, ఆప్ నేత)
కార్పొరేట్ల బడ్జెట్
బడ్జెట్.. కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న ఎన్డీయే ఆర్థిక విధానానికి తగ్గట్టే ఉంది. వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తామని చెబుతూనే ఎరువుల సబ్సిడీని తగ్గించారు.
-డి. రాజా (సీపీఐ జాతీయ కార్యదర్శి)
నిరాశపరచింది
మోడీ బడ్జెట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. నల్లధనవంతులకే మంచిరోజులని హామీ ఇచ్చారు. బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామన్న రూ. 1.25 లక్షల కోట్ల ఊసే ఎత్తలేదు.
-నితీశ్ కుమార్(బిహార్ సీఎం, జేడీయూ)
అందరి బడ్జెట్
ఇది దార్శనికత, ప్రగతిశీల బడ్జెట్. అందరి బడ్జెట్. పోర్టులు, రైల్వే, విమానాశ్రయాలు, ఆరోగ్యం వంటి ఎన్నో రంగాలకు ప్రాధాన్యం దక్కింది. ప్రధాని నినాదం ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ ప్రతిఫలించింది. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే కలను నెరవే ర్చేలా ఉంది.
- రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య (కేంద్ర మంత్రులు)
మంచి బడ్జెట్
ఇప్పటివరకూ నేను చూసిన బడ్జెట్లలో ఇదొక మంచి బడ్జెట్. విస్మరణకు గురయ్యే సాగుకు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం సంతోషంగా ఉంది. దేశాన్ని శక్తిమంతం, సుసంపన్నం చేయడానికి ప్రధాని, ఆర్థిక మంత్రి అనుసరిస్తున్న వైఖరికి ఇది నిదర్శనం.
-ఎల్‌కే అద్వానీ(బీజేపీ అగ్రనేత)
నిర్దిష్ట పథకాల్లేవు
బడ్జెట్‌లో పరిమళం లేదు. నిర్దిష్ట పథకాలను ప్రకటించలేదు.
గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి చెప్పలేదు.
- జయలలిత, తమిళనాడు సీఎం
మోదీ.. మొద్దు విద్యార్థి
బడ్జెట్ పరీక్షలో మోసం, అబద్ధాలకుగాను బహిష్కరణకు గురైన మొద్దు విద్యార్థి మోదీ. లోక్‌సభ ఎన్నికల నాటిహామీలను ఆయన నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. నల్లధనం తీసుకురాకుండా నల్లధనవంతులకు మేలు చేశారు.
-లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ చీఫ్)