సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ నిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎనిమిది విపక్ష పార్టీలు సంయుక్త తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ నుంచి ముగ్గురు మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ పాలనలో ప్రజాస్వామ్యయుతంగా వెలిబుచ్చే నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారని, రాజ్యాంగ హక్కులైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కాలరాస్తున్నారని తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. జమ్ము కశ్మీర్‌లో గృహనిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు మాజీ సీఎంలతో పాటు ఇతర రాజకీయ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని తీర్మానం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment