శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఆమె మరో మూడు నెలలపాటు గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. ఈ నిర్ణయంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఏమీ చేయకపోయినా, నోరు విప్పి ఎలాంటి సందేశాలివ్వకపోయినా ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడమే కాక తన చర్యను సమర్థించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మడానికి కూడా వీలు లేనంత కౄరమైన చర్యగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని దశాబ్ధాల వెనక్కు నెట్టివేసిందనడానికి నిర్బంధం పొడిగింపే సజీవ సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. (ఒమర్ అబ్దుల్లా నిర్ణయం, ప్రధాని మోదీ ప్రశంసలు)
జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ప్రజా భద్రతా చట్టం కింద పలువురు నేతలకు గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. అందులో మెహబూబా ముఫ్తీతో పాటు ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు. వీరందరికీ పలు దఫాలుగా నిర్బంధం నుంచి విముక్తినిచ్చిన ప్రభుత్వం మెహబూబా ముఫ్తీతోపాటు అలీ మహమ్మద్ సాగర్, సర్తాజ్ మదానీల నిర్బంధం గడువును మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా ఈ చట్టాన్ని ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందించారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. (‘మళ్లీ డిటెన్షన్..! ఇదంతా పక్కా ప్లాన్’)
Comments
Please login to add a commentAdd a comment