పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు అటు రాజ్యసభ, లోక్ సభల్లో పట్టుబట్టాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులకు పరిష్కారాలు చూపాల్సిన ప్రధాని మోదీ అవేమీ పట్టించుకోకుండానే ప్రతిపక్షాలను తప్పుబట్టడాన్ని విమర్శిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని సభలో ఉండి సావధానంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ పక్క కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు బంద్ పాటించడం, కాంగ్రెస్ నిరసనలు తెలపడం ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బంద్ ర్యాలీలు, రైల్ రోకోలు, రహదారులు స్తంబింపచేయడం వంటి చర్యలు చేస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన సమావేశాలు మరింత వేడిని తలపించాయి.
దీంతో అటు లోక్ సభ, రాజ్యసభలు తొలుత 12గంటల వరకు వాయిదా పడ్డాయి. దీంతో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాసేపు పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టారు. 12గంటలకు తిరిగి ఉభయసభలు ప్రారంభమైనా రాజ్యసభలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో తిరిగి మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. అనంతరంకొద్ది సేపు లోక్ సభ నడిచినా చివరకు దానిని కూడా మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు.