‘గూండా’ చట్టంపై వ్యతిరేకత
సాక్షి, చెన్నై: సైబర్ నేరాలు, లైంగిక దాడులను గూండా చట్టం పరిధిలోకి తీసుకురావడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సవరణలను పీఎంకే అధినేత రాందాసు తీవ్రంగా ఖండించారు. ఆ సవరణల్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తిపై పలు కేసులు నమోదైనా, పలు సెక్షన్లు మోపినా, పలు మార్లు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చినా వారిపై గూండా చట్టం ఇది వరకు నమోదు అయ్యేది.
ఏడాది కాలం పాటుగా నాన్‌బెయిల్ వారెంట్‌గా ఉండేది. అయితే, ఇటీవల ఈ చట్టాల్ని పలు విధాలుగా ఉపయోగించే పనిలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పేట్రేగుతున్న సైబర్‌నేరాలు, మహిళలపై లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యల్లో పడింది. ఇందులో భాగంగా సైబర్ నేరాలకు పాల్పడేవారిని, లైంగిక దాడులకు పాల్పడేవారిని గూండా చట్టం కింద అరెస్టుకు ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో ముసాయిదా సైతం దాఖలు చేసింది. అయితే, ఈ చట్టం లైంగిక దాడుల కేసుల్లో దుర్వినియోగం కావొచ్చన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు రాగానే, ఎలాంటి విచారణ లేకుండా ఈ సెక్షన్ నమోదవుతున్న దృష్ట్యా, వ్యతిరేకత మెుదలైంది.
దుర్వినియోగం : పీఎంకే అధినేత రాందాసు శుక్రవారం ఓ ప్రకటనలో ఈ చట్టం నమోదును తీవ్రంగా వ్యతిరేకించారు. లైంగిక దాడులు, సైబర్ నేరాలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం ద్వారా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. తొలి సారిగా నేరం చేశాడంటూ ఒకరిపై ఫిర్యాదు వస్తే, విచారణ లేకుండా ఈ చట్టం నమోదు చేయడం వలన ఏడాది కాలం పాటు అతడు జైలుకు పరిమితం కావాల్సి ఉంటుందన్నారు. చివరకు అతడు నేరం చేయలేదని రుజువు అయితే, ఏడాది జీవితం వృథా అయ్యే పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందుకు ఉదాహరణ తమ ఎమ్మెల్యే, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గురు మీద నమోదైన జాతీయ భద్రతా చట్టం, గుండా చట్టాల కేసును పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించారు. గురుపై మోపిన కేసులన్నీ చివరకు కోర్టులో కొట్టి వేశారని, అయితే, చేయని తప్పుకు ఆయన శిక్ష అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భారత శిక్షాస్మృతి చట్టంలో లైంగిక దాడులకు మరెన్నో కఠిన శిక్షలు ఉన్నాయని, అలాంటప్పుడు చట్ట సవరణలతో గూండా చట్టం పరిధిలోకి లైంగిక దాడులు, సైబర్ నేరాలను తీసుకురావడం విచారకరంగా పేర్కొన్నారు. తన సవరణలను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.