
కలకలం సృష్టించిన పన్నీర్ సెల్వం ట్వీట్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చి తలైవీ(అమ్మ) అన్నాడీఎంకే పార్టీ నేత పన్నీర్ సెల్వం ఒక్క ట్వీట్‌తో కలకలం సృష్టించారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని ట్వీట్ చేసి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించి అనంతరం ఆ ట్వీట్‌ను తొలగించారు. ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది తర్వాత చెప్తామంటూ సవరణ చేసి మరో ట్వీట్‌లో స్పష్టతనిచ్చారు. ‘స్థానిక ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత మేం బీజేపీతో పొత్తు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని పన్నీర్ సెల్వం తరుపున ట్వీట్లు చేసే ఆయన కార్యాలయం ఒక ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ బయటకు రాగానే తమిళనాడులో విస్తృత చర్చ మొదలైంది. అసలు ఏం జరుగుతోందంటూ తమిళనాడులో ప్రతి ఒక్కరు స్పందించడం మొదలుపెట్టారు. ఒక రకంగా సెల్వానికి వ్యతిరేకంగానే ప్రతిస్పందనలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయన టీం వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించి పరిస్థితులకు తగినట్లుగా స్థానిక ఎన్నికల తేదీలు విడుదల చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని, అది ఏ పార్టీతో ఉంటుందనే విషయం స్పష్టం చేయలేమని చెప్పారు.