
వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు
కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం
సత్యమేవ జయతే అంటూ వైఎస్సార్‌సీపీ ట్వీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సత్యమేవ జయతే పేరుతో పోస్ట్ చేసింది. ‘గన్నవరం ఘటనలో పాపం ఎవరిది? సీఎం చంద్రబాబు కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ స్టేట్‌మెంట్’ అంటూ వాంగ్మూలం రిపోర్ట్ కాపీని ట్యాగ్ చేసింది. సత్యవర్థన్ స్టేట్‌మెంట్‌లో ఏమున్నదంటే...‘టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వాళ్లు ఎవరో నాకు స్పష్టంగా తెలియదు. కానీ.. ఒక రిపోర్ట్ తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం నన్ను సంతకం చేయమని చెప్పాడు. నేను చేశాను.
అందులో ఏముందో, ఎవరి పేర్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు. కేసులు, కోర్టుల చుట్టూ నేను తిరుగుతుండటంతో మా కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు’ అంటూ రాశారు. ఆధారాలతో కూడిన ఈ స్టేట్‌మెంట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పన్నిన కుట్రలు, గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులకు 2025 ఫిబ్రవరి 10న కోర్టు ముందు సత్యవర్థన్ ఇచ్చిన స్టేట్‌మెంటే నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పేర్కొంది.
ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నాడని సత్యవర్థన్ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిపింది.