
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌తో పాటుగా వంశీ మెడికల్ రిపోర్టులతో మరో పిటిషన్ కూడా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యేక వైద్య వసతులు, ఇంటి నుంచే ఆహారం అందించే సదుపాయం కల్పించాలని కోరారు. మరోవైపు.. ఇప్పటికే వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తన బెయిల్ పిటిషన్‌లో వంశీ కీలక అంశాలను వెల్లడించారు. బెయిల్ పిటిషన్‌లో భాగంగా వంశీ..‘తనపై రాజకీయ, వ్యక్తిగత కక్షతో కేసులు నమోదు చేశారు. సత్య వర్ధన్‌ను తాను కిడ్నాప్ చేశాననేది అక్రమంగా పెట్టిన కేసు. తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకి వచ్చినట్టు సత్య వర్ధన్ కోర్టుకు తెలిపాడు. గతంలో కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు కోర్టు ఇస్తే సత్య వర్ధన్ వచ్చారు. కేసుతో తనకు సంబంధం లేదని తనను ఎవరూ తిట్టలేదని పోలీసులకు కూడా గతంలోనే సత్య వర్ధన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే విషయాన్ని మళ్లీ కోర్టుకు సత్య వర్ధన్ తెలిపారు తప్ప నా ప్రమేయం లేదు’ అని తెలిపారు.
ఇక, మెడికల్ గ్రౌండ్స్‌లో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరో పిటిషన్ దాఖలు చేశారు. వెన్నుపూస నొప్పి కారణంగా జైలులో తనకు బెడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని, ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే జైలు అధికారులతో తనకు వెన్నుపూస నొప్పి ఉందని మంచం కావాలని జైలు అధికారులను కోరారు. జైలు అధికారులు కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించడంతో వంశీ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment