ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్ భారత్‌లో పంజా విసురుతోంది. ఇప్పటికే 2.5 లక్షల కరోనా కేసులతో మనదేశం ప్రపంచ పట్టికలో ఇటలీని దాటేసి ఆరో స్థానంలో నిలిచింది. ఇక అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూసి ఉన్న సంగతి తెలిసిందే. పరీక్షలు సైతం నిర్వహించలేమని చాలా రాష్ట్రాలు వాయిదా వేశాయి. అయితే, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు మాత్రం విద్యా సంస్థలు బంద్ ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి లోకం సోషల్ మీడియా వేదికగా గళమెత్తింది. తమ ప్రాణాలను రిస్కులో పెట్టి పరీక్షలు రాయలేమని స్పష్టం చేసింది. విద్యార్థులంతా #StudentLivesMatter హాష్‌టాగ్‌తో ఆయా ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేయడంతో అది ట్రెండింగ్‌లో ఉంది.
అన్నీ మీరే చెప్పారు.. ఇప్పుడేమో!
‘వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వచ్చేలా లేదని, భౌతిక దూరంతోనే కోవిడ్‌ను దూరంగా తరిమేయొచ్చని ఎందరో నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వాలు కూడా అదే విషయాన్ని చెప్పి లాక్‌డౌన్ విధించాయి. ఇప్పుడేమో అన్నిటికీ తలుపులు బార్లా తెరిచారు. విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఇక మాస్కు ధరించడం.. వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాటిస్తారనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో.. పరీక్షలు అవసరమా’ అని విద్యార్థులు మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, దేశంలో కోవిడ్ నిలయంగా మారిన మహారాష్ట్ర.. కేసుల్లో చైనాను అధిగమించిన సంగతి తెలిసిందే.
(చదవండి: కరోనా: అవసరం లేకపోయినా చికిత్స.. )
ట్విటర్‌లో మరిన్ని కామెంట్లు
‘పరీక్షలు నిర్వహిస్తే.. చూపులేని వారు, కంటి సమస్యలతో బాధపుడుతన్నవారి పరిస్థితేంటి’ అని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. ‘ప్రొఫెసర్లకు కరోనా సోకిందని మీరే యూనివర్సిటీ మూసేస్తారు. మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలా’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. పరీక్షల కోసం తమ ప్రాణాలను, కుటుంబాన్ని రిస్కులో పెట్టలేమని మరో విద్యార్థి తేల్చిచెప్పారు. ‘ముందుగా పార్లమెంట్ తెరవండి. తర్వాత కాలేజ్‌లను ఓపెన్ చేద్దురు గాని’ అని ఇంకో యూజర్ వ్యగ్యాంస్త్రం సంధించారు. ‘స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా శానిటైజ్ చేశామని ప్రభుత్వాలు చెప్పలగలవా. మా కోసం, కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం. పరీక్షలకు భయపడి కాదు’ అని మరో విద్యార్థి పేర్కొన్నారు. కాగా, ఒడిశాలో జూన్ 11 నుంచి పాఠశాల, కాలేజీ విద్యార్థుల పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇక గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ అనుమతితో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment