అండమాన్‌లో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు!
అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్‌లాక్, నీల్ ద్వీపాల్లో భారీ వర్షాలు, తుపానులో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్‌లాక్, నీల్ ద్వీపాల్లో భారీ వర్షాలు, తుపానులో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయన్నారు. పర్యాటకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ట్వీట్‌లో పేర్కొన్నారు. తుపాను తీవ్రత తగ్గగానే రక్షణ చర్యలు ప్రారంభమవుతాయని, ఇప్పటికే బృందాలు పోర్ట్ బ్లెయిర్‌లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వార్దా తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.
ద్వీపంలో ఉన్నవారిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు నౌకాదళం నాలుగు నౌకలను అక్కడకు పంపింది గానీ, వాతావరణం బాగోకపోవడంతో అవి లంగరు వేయలేకపోయాయి. ఐదు మీటర్ల ఎత్తులో కెరటాలు వస్తుండటంతో ప్రయాణికులను నౌకల్లోకి చేర్చడం అసాధ్యంగాను, ప్రమాదకరంగాను మారింది. నౌకలు పోర్టు వెలుపల వేచి చూస్తున్నాయని, వాటిలో తగినంత ఆహారం, తాగునీరు, మందులు, వైద్యసిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. పోర్ట్‌బ్లెయిర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం అంతా తుపాను పరిస్థితులతో తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలు, బలమైన గాలులతో పాటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. దీన్ని ఎల్1 విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో నీల్, హేవ్‌లాక్ ద్వీపాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. పలు నౌకలు, హెలికాప్టర్లలో ఇక్కడకు చేరుకుంటారు. కానీ సోమవారం నుంచి అసలు నౌకలు గానీ, హెలికాప్టర్లు గానీ ఇక్కడకు రాలేకపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం పది గ్రామాలకు నిత్యావసరాల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. పలు చెట్లు కూకటివేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోర్ట్‌బ్లెయిర్‌లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మొబైల్ సిగ్నళ్లు, ఇంటర్‌నెట్ కూడా చాలాచోట్ల నిలిచిపోయాయి.