cyclone vardah
-
కళ్ళుబైర్లు కమ్మేలా విమాన చార్జీల వసూలు
-
తమిళనాడును వణికిస్తున్న మరో ముప్పు!
-
లైవ్: తమిళనాడును వణికిస్తున్న మరో ముప్పు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు వర్దా తుపానుతో ఛిన్నాభిన్నం అయిన తమిళనాడును మరో ముప్పు వెంటాడుతోంది. రానున్న 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం ఒక్కసారిగా విరుచుకుపడిన వర్దా తుపానుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ తుపాను దెబ్బకు రెండు రాష్ట్రాల్లో దాదాపు 12 మంది ప్రాణాలు విడిచారు. తుపాను దెబ్బకు పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్ల మీద వాహనాలు గాలిలో గింగిరాలు తిరిగాయి. ఈ తుపాను దెబ్బతో చెన్నై నగరం తీవ్రంగా అల్లాడింది. అయితే, మంగళవారం నాటికి చెన్నైలో పరిస్థితులు కొంతమేరకు కుదటపడ్డాయి. సాధారణ జనజీవనం క్రమంగా మెరుగుపడుతోంది. చెన్నై విమానాశ్రయంలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం ముందుజాగ్రత్త చర్యగా వరుసగా రెండోరోజు చెన్నై, కాంచీవరం, తిరువల్లూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరోవైపు వర్దా తుపాను సంభవించినప్పటికీ ఈ నెల 16 నుంచి చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరగనుంది. ఇక వర్దా తుపాను క్రమంగా బలహీన పడుతోందని, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తున్నదని, దీని ప్రభావంతో రానున్న 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణశాఖ తెలిపింది. -
ఏపీని వణికించిన వర్దా తుఫాన్
-
శాంతిస్తున్న 'వర్దా', ఏడుగురు మృతి
-
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు
తిరుపతి: వర్దా తుపానుతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 40 విద్యుత్ స్తంభాలు, 30 చెట్లు కూలాయి. నారాయణవనంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పిచ్చాటూరులో 14, పుత్తూరులో 13, తిరుపతిలో 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో కాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ మూడు నియోజకవర్గాల్లో మంగళవారం విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. -
వర్దా తుపానుపై సోనియా ఆందోళన
న్యూఢిల్లీ: వర్దా తుపాను చెన్నై-పులికాట్ సరస్సు మధ్య తీరాన్ని తాకిన నేపథ్యంలో తమిళనాడులోని సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. 'వర్దా తుపాను చెన్నై సమీపంలో తీరాన్ని తాకిన నేపథ్యంలో నగరం ఎదుర్కొనే పరిస్థితులపై ఆందోళన చెందుతూ.. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకొని నిలబడాలని ప్రార్థిస్తున్నాం. ఈ కష్టకాలంలో ప్రజల భద్రతకు స్థానిక అధికార యంత్రాంగాలు సరైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాయని మేం ఆశిస్తున్నాం. గత ఏడాది ఇలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న చెన్నై, తమిళనాడు ప్రజలు మరోసారి అదే మొక్కవోని ధైర్యసాహసాలను ప్రదర్శించి ఈ విపత్తును ఎదుర్కొంటారని దేశం ఆశిస్తోంది. ఈ సమయంలో యావత్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంది' అని ఒక ప్రకటనలో సోనియాగాంధీ తెలిపారు. ప్రచండ గాలులు, అతి భారీ తుపానుతో వర్దా అత్యంత శక్తిమంతంగా తీరాన్ని దాటిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి ప్రకోపంలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. -
శాంతిస్తున్న 'వర్దా', ఏడుగురు మృతి
చెన్నై: కొద్ది గంటలపాటు చెన్నై మహానగరంతో పాటు ఉత్తర తమిళనాడును అతలాకుతలం చేసిన వర్దా తుపాను చెన్నై నగరాన్ని దాటేసింది. దీంతో ప్రచండ గాలుల వేగం కూడా తగ్గుముఖం పడుతోంది. సోమవారం మధ్యాహ్నం తీరం దాటే ముందు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రస్తుతం 15-25 కిలోమీటర్ల వేగానికి తగ్గాయి. తుపాను చెన్నైను దాటి వెళ్లిపోయినట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురంలలో వచ్చే 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వర్దా ధాటికి నగరంలో ఏడుగురు చనిపోయినట్లు సమాచారం. వీరిలో 3 సంవత్సరాల బాలుడితో పాటు నలుగురు మహిళలు ఉన్నట్లు తెలిసింది. వర్దా తుపాను చెన్నై వాసులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో భారీగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ప్రధానరహదారుల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు చెట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొట్టివక్కం, పలవక్కం, ఫోర్ షోర్ ఎస్టేట్, రోయపురంలలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా గోడలు కూలిపోయిన సంఘటనలు జరిగినట్లు రిపోర్టులు కూడా అందాయి. దీంతో చెన్నై మొత్తం అంధకారంలోనే మగ్గుతోంది. కరెంటు వ్యవస్ధను పునరుద్ధరించేందుకు ఒక రోజు పడుతుందని టీఎన్ఈబీ అధికారులు చెప్పారు. బీసెంట్ నగర్, కేకే నగర్, ఖదేర్ నవాజ్ ఖాన్ రోడ్, అడమ్ బక్కం, మెరినాల్లో వీచిన భారీ గాలులకు సెల్ టవర్లు కుప్పకూలాయి. -
అంధకారంలో తమిళ రాజధాని
చెన్నై: వర్దా తుపాను కారణంగా చెన్నై మహానగరం చీకటిమయం అయింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచే కరెంట్ లేకపోవడంతో చెన్నై వాసులు చీకట్లో మగ్గుతున్నారు. ఈ రోజు తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీయడంతో కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. చెట్లు విరిగిపడడంతో కరెంట్ తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా స్తంభించింది. విద్యుత్ నిలిచిపోవడంతో సెల్ టవర్లు పనిచేయడం లేదు. మొబైల్ ఫోన్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ కూ అంతరాయం కలిగింది. తుపాను నేపథ్యంలో అమ్మ క్యాంటీన్లను 24 గంటలూ తెరిచివుంచాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం పన్నీరు సెల్వం ఆదేశించారు. -
నెల్లూరు జిల్లాలో అప్రమత్తత
-
నెల్లూరు జిల్లాలో అప్రమత్తత
నెల్లూరు: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను కారణంగా ముప్పు పొంచివుందన్న సమాచారంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వార్దా తీవ్ర పెను తుపానుగా మారడంతో 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లతో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిందని చెప్పారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్(1800 4252499) ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వార్దా తుపాను రేపు సాయంత్రం చెన్నై-పులికాట్ సరస్సు మధ్య తీరం దాటే అవకాశముంది. ఈ సమయంలో 4 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా చేస్తున్నారు. తుపాను తీరం దాటేప్పడు గంటలకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. -
అండమాన్‌లో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు!
అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్‌లాక్, నీల్ ద్వీపాల్లో భారీ వర్షాలు, తుపానులో చిక్కుకున్న 1400 మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయన్నారు. పర్యాటకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ట్వీట్లో పేర్కొన్నారు. తుపాను తీవ్రత తగ్గగానే రక్షణ చర్యలు ప్రారంభమవుతాయని, ఇప్పటికే బృందాలు పోర్ట్ బ్లెయిర్‌లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వార్దా తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ద్వీపంలో ఉన్నవారిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు నౌకాదళం నాలుగు నౌకలను అక్కడకు పంపింది గానీ, వాతావరణం బాగోకపోవడంతో అవి లంగరు వేయలేకపోయాయి. ఐదు మీటర్ల ఎత్తులో కెరటాలు వస్తుండటంతో ప్రయాణికులను నౌకల్లోకి చేర్చడం అసాధ్యంగాను, ప్రమాదకరంగాను మారింది. నౌకలు పోర్టు వెలుపల వేచి చూస్తున్నాయని, వాటిలో తగినంత ఆహారం, తాగునీరు, మందులు, వైద్యసిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. పోర్ట్‌బ్లెయిర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం అంతా తుపాను పరిస్థితులతో తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలు, బలమైన గాలులతో పాటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. దీన్ని ఎల్1 విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో నీల్, హేవ్‌లాక్ ద్వీపాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. పలు నౌకలు, హెలికాప్టర్లలో ఇక్కడకు చేరుకుంటారు. కానీ సోమవారం నుంచి అసలు నౌకలు గానీ, హెలికాప్టర్లు గానీ ఇక్కడకు రాలేకపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం పది గ్రామాలకు నిత్యావసరాల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. పలు చెట్లు కూకటివేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోర్ట్బ్లెయిర్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మొబైల్ సిగ్నళ్లు, ఇంటర్నెట్ కూడా చాలాచోట్ల నిలిచిపోయాయి.